అక్షర టౌన్ షిప్ కు నాలా కన్వర్షన్ ఎలా ఇచ్చారో..?

నిబంధనలు తుంగలో తొక్కడానికి కారణమేంటో..?

దిశ దశ, కరీంనగర్:

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సమీపంలో అక్షర టౌన్ షిప్ నిర్వాహాకులు దరఖాస్తు చేసుకోగానే రెవెన్యూ అధికారులు నాలా కన్వర్షన్ ఎలా ఇచ్చారన్నదే మిస్టరీగా మారింది. వ్యవసాయ భూమి పట్టాదారుకు సంబంధించినది అయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్ మెంట్ (NALA) అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న తరువాత క్షేత్ర స్థాయిలో భూమిని పరిశీలించి రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అక్షర టౌన్ షిప్ చేపట్టిన వెంచర్ లో ఎస్సారెస్పీ కెనాల్ కు అనుసంధానం చేసిన ఛానెల్స్ కూడా ఉన్నాయి. ప్రజా అవసరాలకు సంబంధించినవి ఉన్నట్టయితే నాలా ద్వారా అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ అక్షర టౌన్ షిప్ వెంచర్ లో ఎస్సారెస్పీ ఫీల్డ్ ఛానెల్స్ ఉన్నాయన్న విషయాన్ని విస్మరించి మరీ అనుమతి ఇవ్వడం విడ్డూరం. వెంచర్ నిర్వాహకులు భూమిని లెవలింగ్ చేస్తున్న క్రమంలో ఫీల్డ్ ఛానెల్స్ ను మూసేయడంతో పాటు, రెండు ధ్వంసం అయ్యాయని అప్పటి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. వెంచర్ లో ఫీల్డ్ ఛానెల్స్ ఉన్నందున దిగువ ప్రాంత రైతాంగానికి నష్టం చేకూరే అవకాశం ఉందని ఈ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడి చేయరాదని దరఖాస్తును తిరస్కరించకపోవడానికి కారణమేంటన్నది మిస్టరీగానే మారింది. ఫీల్డ్ ఛానెల్స్ క్లోజ్ కావడంతో పాటు కొన్ని ధ్వంసం అయ్యాయన్న విషయాన్ని గమనించిన అప్పటి ఎస్సారెస్పీ అధికారులు అప్పటికప్పుడు నివేదికలు సిద్దం చేశారు. ఆ తరువాత ఈ విషయాన్ని మరుగున పడేయడం వెనుక జరిగిందేంటన్నది వారికే తెలియాలి.

అదెలా మేనేజ్ చేశారో..?

అక్షర టౌన్ షిప్ నిర్వాహకులు వెంచర్ ఏర్పాటు కోసం కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (SUDA)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అక్షర టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు Lr.Roc.No.3145/Nagunur/2021/0167 తేది: 11.08.2021న అనుమతుల ఇచ్చారు. అయితే వెంచర్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి ప్రధాన రహదారికి అనుంసధానంగా కనీసం 40 ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ రహదారినే 40 ఫీట్ల రహదారిగా చూపించి SUDA నుండి అనుమతులు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. వెంచర్ ను సిద్దం చేస్తున్న క్రమంలో స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు ఎస్సారెస్పీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో రైతుల ముసుగులో రోడ్డు నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్న విషయం, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ రోడ్డునే తమ రోడ్డుగా చూపించుకున్న విషయం, వెంచర్ లో ఫీల్డ్ చానెల్స్ ధ్వంసం అయిన విషయంలో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుడాకు లేఖ రాశారు. ఇంత జరిగినా అప్పటి అధికారులు నాలా కన్వర్షన్ ఎలా చేశారన్న విషయం కానీ, ఎస్సారెస్పీ ఆస్తలు ధ్వంసం చేసిన అంశాన్ని కానీ తీవ్రంగా పరిగణించకపోవడానికి కారణమేంటన్నది ఆయా విభాగాల అధికారులకే తెలియాలి. అప్పటి సుడా అధికారులు కూడా తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని సంస్థపై చర్యలు తీసుకోలేదు. ఇరిగేషన్ అధికారులు అభ్యంతరాలు సుడా వద్ద ఉన్నప్పటికీ తాజాగా అక్షర టౌన్ షిప్ లో అంతర్గత రోడ్లతో పాటు ఇతరాత్ర అభివృద్ది పనులు చేపడుతుండడం గమనార్హం.

Akshara Townshipkarimnagar newsReal EstateREAL MAFIASRSP CANAL ROAD