గుంపుల TO తనుగుల… ఆ రోజు ఏం జరిగింది..?

చెక్ డ్యాం డ్యామేజీపై లోతుగా దర్యాప్తు…

దిశ దశ, హుజురాబాద్:

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం కుంగిపోయిందా..? పేల్చివేతకు గురైందా..? నవంబర్ 21వ తేది రాత్రి ఏం జరిగింది..? అనుమానితులు ఎవరైనా ఆ ప్రాంతంలో సంచరించారా..? పేలుడు సామాగ్రిని తరలించారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు. రెండు జిల్లాల నడుమ నిర్మాణం జరిగిన తనుగుల చెక్ డ్యాం ఒక్కసారిగా కుంగుబాటుకు గురి కావడం వెనక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అన్న విషయంపై పోలీసులు ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు.

నవంబర్ 21 రాత్రి…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని తనుగుల, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామాల నడుమ 2021లో నిర్మించిన చెక్ డ్యాం నవంబర్ 21వ తేది రాత్రి కుంగుబాటుకు గురైంది. దీంతో చెక్ డ్యాం ఖాలీ కావడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం బ్యాక్ వాటర్ వల్ల సాగుకు అనుకూలంగా ఉండేదని, భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉన్నాయని రైతులు అంటున్నారు. అయితే ఉన్నట్టుండి చెక్ డ్యాం కుంగిపోవడంతో నీరంతా దిగువకు చేరుకోవడం వల్ల సాగు నీటి కొరత ఏర్పడుతుందని స్థానికులు చెప్తున్నారు. అయితే నాలుగేళ్ల తరువాత ఈ చెక్ డ్యాం కుంగుబాటుకు గురి కావడానికి కారణం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయింది. లక్ష క్యూసెక్కుల వరద వచ్చినా కూడా తట్టుకుందని, అలాంటిది ఇప్పుడు చెక్ డ్యాం కొట్టుకపోవడం వెనక పేల్చివేతే కారణమని బీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డిలు ఆరోపించారు. వ్యవసాయ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్న చెక్ డ్యాం కావడంతో డ్యామేజీకి అసలు కారణం ఏంటన్నది తేల్చాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలంలు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి అసలేం జరిగిందన్న విషయంపై దృష్టి సారించారు. చెక్ డ్యాం డ్యామేజీ అయిన నవంబర్ 21వ తేదిన అసలేం జరిగింది అన్నది తేల్చాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 21 తేది రాత్రి తనుగుల వైపు నుండి కానీ, గుంపుల వైపు నుండి కాని చెక్ డ్యాం పరిసర ప్రాంతాలకు ఏమైనా వాహనాలు వెళ్లాయా..? అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించారా అన్న వివరాలను సేకరిస్తున్నారు. గుంపుల వైపు నుండి కొంతమంది వ్యక్తులు వేర్వేరు సమయాల్లో మానేరు నదివైపునకు నడుచుకుంటూ వెళ్లారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారిని గుర్తించి విచారిస్తున్నట్టుగా సమాచారం. హార్వెస్టర్ (వరి కోత) మిషన్ ఒకటి మానేరు నదివైపునకు వెల్లినట్టుగా గమనించిన దర్యాప్తు అధికారులు డ్రైవర్ గురించి వాకబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిందరిని విచారించినట్టయితే చెక్ డ్యాం డ్యామేజీ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉండే మత్సకారులు కూడా రాత్రి వేళ్లలో చెక్ డ్యాం నీటిలో వలలు చేపలు పట్టేందుకు వెలుతుంటారని తెలుసుకున్న పోలీసులు వారిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తనుగుల, గుంపుల పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాల్లో కూడా సంచరిస్తున్న పోలీసులు ఘటన జరిగిన రోజున భారీ శబ్దాలు వినిపించాయా అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్యామేజీ అయిన చెక్ డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా పేలుడుకు ఉపయోగించిన ఆనవాళ్లు ఏమైనా పడ్డాయా అన్న విషయంపైనా దృష్టి సారించినట్టుగా సమాచారం.

అదే కీలకం…

ఓ వైపున స్థానికంగా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనన్న కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు మరో వైపున నిపుణులను కూడా రంగంలోకి దింపారు. ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరికి చెందిన నిపుణులు కూడా చెక్ డ్యాం డ్యామేజీ అయిన ప్రాంతాన్ని సునిశితంగా పరిశీలించారు. అక్కడ లభ్యమైన కొన్నింటిని సేకరించిన FSL నిపుణులు ల్యాబ్ లో పరిశీలనలు జరుపుతున్నారు. వారిచ్చిన నివేదికను, స్థానికంగా జరిపిన విచారణ నివేదికల ఆధారంగా తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

విమర్శలు… సవాళ్లు…

చెక్ డ్యాం డ్యామేజీ అయిన విషయంపై రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం ప్రారంభం అయింది. మాజీ మంత్రలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని సందర్శించి ఇది ముమ్మాటికి కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. ఇసుక మాఫియానే చెక్ డ్యాంను ధ్వంసం చేసిందని ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే చెక్ డ్యాం ఘటనపై స్పందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు అది పేల్చివేతకు గురి కాలేదని, ఒక వేళ అదే నిజమైతే తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇందుకు కౌంటర్ గా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెక్ డ్యాం వద్ద ఉన్న బండరాళ్లలో ఏర్పాటు చేసిన తీగలకు సంబంధించిన వీడియో ఫుటేజీని మీడియా ముందు ప్రదర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని తాను ఆధారాలు చూపించానని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. చెక్ డ్యాం వద్ద ఉన్న బండ రాళ్లకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఆధారంగా కూడా పోలీసులు ఆరా తీయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఘటనా స్థలంలో చెక్ డ్యాం నిర్మాణాలు మాత్రమే ఉండగా, హుజురాబాద్ ఎమ్మెల్యే విడుదల చేసిన బండ రాళ్లు ఎక్కడ ఉన్నాయి..? అక్కడ పేలుడుకు ఉపయోగించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమైనట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

కేంద్ర మంత్రి లేఖ…

మానేరు నది చెక్ డ్యాం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమర్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తనుగుల, గుంపుల చెక్ డ్యాం కూలిపోవడం వెనక అసలే జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వీటి నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చెక్ డ్యాం నిర్మాణంపై విజిలెన్స్ విచారణకు సంబంధించిన నివేదిక ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నాయని మండి పడ్డారు. బాధ్యులైన కాంట్రాక్టర్ వద్ద రికవరీ చేసి ఆ డబ్బుతోనే చెక్ డ్యాం నిర్మించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. 2021లో వచ్చిన వరదలప్పుడు కూడా చాలావరకూ కూలిపోయాయని, డిజైన్ లో లోపాలు, నాణ్యత ప్రామణాలు పాటించకపోవడమే ఇందుకు కారణమని విమర్శించారు. 

Check damkarimnagarMANERU RIVERPeddapalliTelangana Politics