దిశ దశ, పెద్దపల్లి:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని తొలిసారి పర్యటనలోనూ వర్గపోరు ప్రదర్శించడంలో వెనకడుగు వేయలేదు పార్టీ శ్రేణులు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న కాషాయ దళంలో గ్రూపు తగదాలు రచ్చకెక్కిన తీరు విస్మయం కల్గిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటనలో బీజేపీ శ్రేణులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణాలో కూడా రాబోతుందని ఢంకా బజాయించి చెప్పుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపిస్తాయోనన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షుని పర్యటనలోనే విబేధాలు రచ్చకెక్కితే ఇతరాత్ర కార్యక్రమాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనన్న చర్చ కూడా మొదలైంది. స్థానికంగా ఉన్న నేతల మధ్య నెలకొన్న ఆదిపత్య పోరు ఏకంగా స్టేట్ చీఫ్ ముందే బయటపడడం క్రమశిక్షణ కలిగిన కాషాయ పార్టీపై చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో దుగ్యాల ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన వాహనంపైకి వెల్లి గజమాల వేయించుకున్న రాష్ట్ర అధ్యక్షుని ముందే పెద్దపల్లి బీజేపీ కార్యకర్తలు తమ నిరసన తెలపడం గమనార్హం. పార్టీ శ్రేణులు చేసిన రచ్చను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు జై గుజ్జులు అని నినదిస్తూ తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. అనంతరం సభా ప్రాంగణంలోనూ అసమ్మతీ వర్గం తమ పంథాన్ని వీడలేదు. ప్రదీప్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్థానికంగా ఉండే పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది సభాస్థలి వద్ద భైఠాయించి తమ నిరసనను ప్రదర్శించారు.