దిశ దశ, వరంగల్:
పీపుల్స్ వార్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసి… తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, భారత్ బచావో వ్యవస్థపాకుడు గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆదివారం అరెస్ట్ చేసింది. జనగామ జిల్లా జఫర్ గడ్ మండల కేంద్రంలో కొంత కాలంగా ఇన్నయ్య ‘మా ఇల్లు ప్రజాధరణ ఆశ్రమాన్ని’ నిర్వహిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఇన్నయ్య ప్రజా ఉద్యమాల్లోనూ పాల్గొంటారు. చత్తీస్ గడ్ దండకారణ్యంలో ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రా రెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. వికల్ప్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. అమరుల బంధు మిత్రుల సంఘం (ABMS) ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు గాదె ఇన్నయ్య హజరయ్యారు. ఈ సందర్భంగా గాదె ఇన్నయ్య చేసిన ప్రసంగంలో దేశ వ్యతిరేకానికి, సాయుధ తిరుగుబాటుకు, విధ్వంసకర కార్యకలాపాలను ప్రేరేపించవిధంగా ఉన్నాయని NIA పేర్కొంది. ఆయన చేసిన ప్రసంగ పాఠాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన తరువాత ఈ కేసు నమోదు చేశామని NIA అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు గత సవంబర్ 26 FIR NO: RC-04/2025/NIA/HYD ప్రకారం భారతీయ న్యాయ సంహిత (BNS) యాక్ట్ 2023, సంఘ విద్రోహ శక్తులను నిరోధించే యాక్ట్ 1967, సెక్షన్ 152, 13&39 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆదివారం జఫర్ ఘడ్ చేరుకున్న NIA అధికారులు అరెస్ట్ నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇన్నయ్యను హైదరాబాద్ లోని NIA స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్…
దేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీని అంతమొందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీకి తిరుగులేని పట్టున్న చత్తీస్ గడ్, ఒడిషా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఏఓబీ ప్రాంతాల్లో కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అడవి బాట పట్టిన వారిని జన జీనవంలోకి వచ్చే విధంగా చొరవ తీసుకోవడంలో కానీ, కూంబింగ్ ఆపరేషన్లలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ ను ఏరివేయడంలో కానీ బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఆయుధ విరమణ ప్రకటిస్తున్న మావోయిస్టుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన చాలా మంది ముఖ్య నేతలు తెలంగాణ, చత్తీస్ గడ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే జన జీవనంలోకి వచ్చారు. అయితే అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో బలగాలు సఫలం అవుతున్నప్పటికీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు విప్లవ పంథాను పెంచిపోషిస్తున్నారని, వీరివల్ల అండర్ గ్రౌండ్ క్యాడర్ పెరిగే ప్రమాదం ఉందని పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం ముందు కూడా ఈ విషయాన్ని ఉంచడంతో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధుల కార్యకలాపాలపై కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా తెలంగాణ, ఏపీ, మద్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు చేరినట్టుగా సమాచారం. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులపై కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేక నిఘా వేసినట్టుగా తెలుస్తోంది. వామపక్ష విప్లవాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులను కట్టడి చేయడంలో భాగంగానే గాదె ఇన్నయ్యపై కేసు నమోదు చేసినట్టుగా అంచనా వేస్తున్నారు.