Telangana Bjp: కాషాయ దండులో కలహాల రాజ్యం…

రాష్ట్ర అధ్యక్షుని ముందే వాగ్వావాదం…

ఏట మధూకర్  ఇంట్లోనే గొడవ… 

ఓ వైపున డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పార్టీ పెద్దలు పదేపదే నినాదం వినిపిస్తోంది… మరో వైపున దక్షిణాదిన పాగా వేయాలని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రమే అనువైనదని  అంచనాలు కూడా వేసుకుంటోంది. ఇక్కడ మాత్రం నాయకుల మధ్య సయోధ్య లేకుండా పోవడం విచిత్రంగా మారింది. ప్రతి జిల్లాలోనూ గ్రూపు తగదాలు వెలుగులోకి వస్తున్న తీరు పార్టీ ముఖ్య నేతలకు తలవంపులను తెచ్చిపెడుతోంది.

అదే నియోజకవర్గం…

పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర అధ్యక్షుని ముందు నాయకులు ఆదిపత్యపోరు కోసం ప్రయత్నిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. బీజేపీ స్టేట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పర్యటించారు. ఈ సమయంలో కూడా స్థానిక నాయకులు బాహాటంగానే నిరసనలు తెలిపిన తీరు పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేసింది. ముఖ్య నేతలు కూడా లోకల్ లీడర్స్ మధ్య నెలకొన్న విబేధాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. తాజాగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల నీల్వాయి గ్రామాన్ని స్టేట్ చీఫ్ రామచందర్ రావు పర్యటించారు. అక్రమ కేసు నమోదు చేశారని కలత చెందిన వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రామచందర్ రావు నీల్వాయిలోని ఏట మధూకర్ ఇంటికి చేరుకున్నారు. ఓ వైపున విషాదంలో ఉన్న మధూకర్ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం చోటు చేసుకోవడం ముఖ్య నాయకులు తలదించుకునేలా చేసింది. పెద్దపల్లి లోకసభ పరిధిలోని రెండు చోట్ల కూడా నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొనడం కమలనాథులను కూడా మింగుడుపడకుండా చేస్తోంది.

అరేయ్… ఒరేయ్…

అరేయ్… ఒరేయ్… చెంప పగులుతుంది అని మాజీ ఎంపీ వెంకటేష్ నేత, తాజా గా జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన గోమాసే శ్రీనివాసులు గొడవ పడడం గమనార్హం. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన ఏట మధూకర్ బలవణ్మరనంతో విషాదంలో కూరుకపోయిన ఆయన కుటుంబ సభ్యుల ముందే సీనియర్ నేతలు ఇద్దరూ మాటలు అనుకోవడం స్థానికులను విస్మయం వ్యక్తం చేసింది. విషాదకర ఘటనతో బాధలో కొట్టుమిట్టాడుతున్న వారి ముందే ఇలా తగవులాడుకోవడం ఎంతవరకు సమంజసమో బీజేపీ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

bandi sanjay bjpbjp politicsbjp state chiefBJP TELANGANAbjp war