నివాసం ఓ చోట… ఓటు మరో చోట…
ఎమ్మెల్యే గంగుల కుటుంబాన్నీ వదిలేయలేదు…
దిశ దశ, కరీంనగర్:
వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా లాభమే అన్నట్టుగా తయారైందా… లేక అధికారుల అజామాయిషీ లేకుండా పోవడం వల్లే ఇలా జరిగిందా..? కావాలనే గందరగోళం సృష్టించాలనకున్నారా అన్నది తెలియదు కానీ కరీంనగర్ కార్పోరేషన్ తుది ఓటరు జాబితా మాత్రం గజిబిజి గజిబిజిగా తయారైంది. హద్దులు పట్టించుకోకుండా, ఏ డివిజన్ లో నివసిస్తున్నారో తెలియకుండా ఇలా ఎలా చేస్తారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. సాధారణ ఓటర్ల విషయంలోనే కాదు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఓటర్ల విషయంలోనూ చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఓటర్ లిస్టు తయారు చేసిన తీరుపై మండిపడ్డారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు.
నివాసం ఓచోట…
మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం 52వ డివిజన్ లో ఉండగా ఆయన కుటుంబ సభ్యుల ఓట్లను మాత్రం 53వ డివిజన్ లో చూపించారు. ఫైనల్ ఓటర్ జాబితా గమనించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అవాక్కయ్యారు. తాము నివసిస్తున్న ప్రాంతంతో సంబంధం లేకుండా వేరే డివిజన్ పరిధిలో తమ ఓట్లను చూపించడం వెనక ఏదో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో ఇలా కావాలనే చేశారని దీనివల్ల బరిలో నిలిచే అభ్యర్థుల తల రాతాలు మారే ప్రమాదం ఉందని ఆశావాహులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లోని కొన్ని డివిజన్ లలో పట్టున్న నాయకులు పోటీ చేయకుండా ఉండాలన్న ఉధ్దేశ్యంతోనే ఇష్టారీతిన ఓటరు జాబితాను తయారు చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం అవుతోంది. డివిజన్ పరిధులతో సంబంధం లేని ఓటర్లను చేర్చడం వెనక అసలేం జరిగిందో తెల్చాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేస్తున్నారు.
డెడ్ లైన్…
కరీంనగర్ ఓటరు లిస్ట్ మాయాజాలం వెనక అసలే జరిగిందో తేల్చాలని, అలాగే ఒక్క రోజులో జాబితాను సవరించాలని లేనట్టయితే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. బుధవారం నాటికల్ల ఓటర్ లిస్ట్ సవరించనట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే ఓటర్ల పేర్లను ఇతర డివిజన్లలో చేయడం వెనక అసలే జరిగిందో తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీలు స్పందించకపోవడం వెనక మర్మమేదో దాగి ఉందని గంగుల కమలాకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.