క్రిమినల్ కేసుతోనే సరా..? శాఖాపరమైన విచారణ ఉండదా..?

దిశ దశ, మంథని:

మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్స్ డ్యామేజీ అవుతున్న తీరుపై కుట్ర కోణంలో అనుమానిస్తున్న ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారా..? సాంకేతికపరమైన అంశాలపై శాఖా పరంగా విచారణ చేసేందుకు మొగ్గు చూపడం లేదా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెల రోజుల్లో రెండు చెక్ డ్యామ్స్ డ్యామేజ్ కావడం సంచలనంగా మారింది. నవంబర్ 21 రాత్రి తనుగుల చెక్ డ్యాం డ్యామేజ్ కాగా, ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా సోమన్ పల్లి వద్ద చెక్ డ్యాం దెబ్బతిన్నది. ఇసుక మాఫియానే వీటిని ధ్వంసం చేశామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనుగుల చెక్ డ్యాం ఘటనపై జమ్మికుంట పోలీసులు, సోమన్ పల్లి ఘటనపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీసులు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పటికే తనుగుల చెక్ డ్యాం వద్ద ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరీ నిపుణుల బృందం తనిఖీలు చేపట్టి నివేదికను సిద్దం చేయగా, సోమన్ పల్లి చెక్ డ్యాం వద్ద శనివారం FSL నిపుణులు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. దీనికి సంబంధించిన నివేదికను FSL నిపుణులు తయారు చేయాల్సిన అవసరం ఉంది.

శాఖా పరంగా..?

అయితే చెక్ డ్యాంల నిర్మాణం విషయంలో అన్నీ తానై వ్యవహరించిన ఇరిగేషన్ విభాగం ఇంజనీర్లు అవి డ్యామేజ్ అయిన తరువాత శాఖా పరమైన విచారణ చేపడుతున్నారా లేదా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. చెక్ డ్యాంలను ధ్వంసం చేశారని ఇరిగేషన్ అధికారులు సంబంధిత స్టేషన్ లలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే చెక్ డ్యామ్స్ ధ్వంసం చేసిందెవరూ..? పేల్చివేత కోసం మందుగుండు సామాగ్రి ఉపయోగించారా..? తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అయితే ఇరిగేషన్ విభాగం నిర్మించిన ఈ చెక్ డ్యాంలు డ్యామేజీ అయిన తరువాత శాఖ పరంగా ఆరా తీయడం లేదన్న చర్చ సాగుతోంది. నిర్మాణం దెబ్బ తిన్న తరువాత అసలే జరిగింది..? నిర్మాణ సమయంలో తీసుకున్న ప్రీకాషన్స్ ఏంటీ..? వినియోగించిన కాంక్రీట్ వివరాలు, స్టీల్ సైజ్ ల ఏమిటీ అన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా చెక్ డ్యాం నిర్మాణం కోసం డెప్త్ ఎంత తీసుకున్నారు..? బెడ్స్ నిర్మాణం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..? వరద ఎక్కువగా వచ్చినా చెక్ డ్యాం డ్యామేజ్ కాకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలేమిటీ..? వరద ఉదృతి సమయంలో ఇసుక కొట్టుకపోయినా చెక్ డ్యాం చెక్కు చెదరకుండా ఉండేందుకు తీసుకున్న పకడ్భందీ చర్యలు ఏమిటీ అన్న విషయాలపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు. ఎక్కువగా మైదాన, అటవీ ప్రాంతాల్లో చెక్ డ్యాంలను నిర్మించేందుకు ప్రాధాన్యత ఇచ్చే వారు. వర్షాకాలంలో వచ్చే వరద నీరు వీటి వద్ద నిలువ ఉండేది. చిన్న చిన్న కాలువలపై కూడా గతంలో చెక్ డ్యాంల నిర్మాణం చేసినప్పటికీ భారీగా వరద నీటి ప్రవాహం ఉండే మానేరు వంటి నదిలో నిర్మిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందన్న విషయంపై అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే మానేరు చెక్ డ్యాంల నిర్మాణం సమయంలో ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా..? తీసుకున్నట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..? అప్పుడు సిద్దం చేసిన ఎస్టిమేట్స్ ను పరిశీలించడంతో పాటు మేజర్ మెంట్స్ (MB) రికార్డ్స్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇసుక మాఫియా పనా..?

చెక్ డ్యాం డ్యామేజీ కాగానే ఇసుక మాఫియా పనేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. మానేరు నదిలో సమృద్దిగా ఇసుక లభ్యం అవుతున్న నేపథ్యంలో మాఫియా చెక్ డ్యాంలను పేల్చివేసేందుకు సాహసిస్తుందా అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సోమన్ పల్లి చెక్ డ్యాం విషయంలోకి వస్తే నెల రోజుల క్రితం వరకూ ఇక్కడ ఇసుక రీచును నిర్వహించారు. ఇటీవలే దానిని మూసేశారు. ఇప్పుడు అక్కడి నుండి ఇసుక తరలించుకపోయినా అభ్యంతరాలు చెప్పేవారు అయితే ఉండరు. అలాంటప్పుడు ఇక్కడి చెక్ డ్యాంను ఇసుక మాఫియా ధ్వంసం చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది అధికారులే తేల్చాలి. అంతేకాకుండా ఈ నెల 17వ తేది పగటి పూట ఈ చెక్ డ్యాం డ్యామేజ్ అయినట్టుగా ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులోనే వెల్లడించారు. ఆ సమయంలో అగంతకులు అక్కడకు వెల్లి ధ్వంసం చేసే అవకాశం ఉంటుందా..? అదే రోజున పంచాయితీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు, అధికారులు నిరంతరం రహదారులపై తిరుగుతూనే ఉన్నారు. గస్తీ తీవ్రంగా ఉన్న పంచాయితీ ఎన్నికల పోలింగ్ రోజున అగంతకులు పేల్చివేతకు సాహసిస్తారా అన్న కోణంలోనూ ఆరా తీయాల్సిన అవసరం ఉంది. చెక్ డ్యాంల నిర్మాణం తరువాత వాటి మెయింటెనెన్స్ గురించి ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్నారా..? వరద ఉధృతి తరువాత ఎక్కడైనా డ్యామేజీ అయిందా అన్న వివరాలు సేకరించారా లేదా అన్న విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది.

Check damDUDILLA SRIDHAR BABUIrrigation DepartmentMANERU RIVERtelangana news