వావిలాలపల్లి ఘటనలో నిందితుని అరెస్ట్…
దిశ దశ, కరీంనగర్:
కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వంచించింది. కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు మానసిక, శారీరక వైకల్యంతో పుట్టడమే ఆ కుటుంబానికి శాపమైంది. చివరకు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలనే కాటేసే పరిస్థితిని తెచ్చిపెట్టింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలో నిందితున్ని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే…
హత్య… హత్యాయత్నం…
ఈ నెల 15వ తేదిన వావిలాలపల్లి వాసవినగర్ లో నివాసం ఉంటున్న మల్లేశం, పోశవ్వల సంతానమైన హర్షిత్, హర్షితలు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. అప్పుడే ఇంటికి చేరుకున్న పోశవ్వ చిన్నారులను ఆసుపత్రికి తరలించగా హర్షిత మరణించిందని వైద్యులు చెప్పారు. అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్ కు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన త్రీ టౌన్ పోలీసులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే పోశవ్వ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య, హత్యాయత్నం కేసులో చిన్నారుల తండ్రి మల్లేశంపై అనుమానం వచ్చి పోలీసులు అతని కోసం గాలించి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడిగట్టానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
పేదరికంతో…
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన అనవేణి మల్లేశం తన కుటుంబ సభ్యులతో కలిసి వావిలాలపల్లిలోని వాసవినగర్ లో నివసిస్తున్నాడు. కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మల్లేశం, పోశవ్వ దంపతులకు హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు)లు జన్మించారు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన వీరిద్దరికి చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం అంటూ లేదు. తమ బిడ్డలను బాగు చేయించేందుకు హైదరాబాద్ లోని నీలోఫర్, ఉస్మానియా, నిమ్స్, బోయినపల్లిలోని నేషనల్ హ్యాండీక్యాప్డ్ హస్పిటల్, కరీంనగర్ లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. ఇటీవల తిరుపతిలోని బర్డ్స్, స్విమ్స్ ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. పుట్టుకతోనే వైకల్యంతో జన్మించిన వీరు జీవితాంతం అలాగే ఉండాల్సిందే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదని వైద్యులు చెప్పడంతో తండ్రి మల్లేశం మానసిక వేధనకు గురయ్యాడు. తిరుపతిలో పరీక్షలు చేయించిన తరువాత కరీంనగర్ చేరుకున్నప్పటి నుండి మల్లేశం మానసిక వేధనకు గురయ్యేవాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని పరిస్థితిలో ఉన్న తాము మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన బిడ్డలను పెంచి పోషించడం ఎలా అన్న మనోవేధన కూడా అతన్ని వెంటాడినట్టుగా తెలుస్తోంది. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా తమ పిల్లలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో వారిని తుదముట్టాంచాలని నిర్ణయించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
విషం కలిపి…
ఈ నెల 15న పోశవ్వ మార్కెట్ కు వెల్లిన సమయంలో కూల్ డ్రింక్ లో విషం కలిపి కొడుకు హర్షిత్, కూతురు హర్షితలకు తాగించాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. ఆ తరువాత కాటన్ టవల్ ను ముక్కలుగా చేసి ఇద్దరికి ఉరి వేసి చంపే ప్రయత్నం చేసిన అనంతరం వాటిని బయట పడేసి ఇంటి నుండి పరార్ అయ్యాడు. మార్కెట్ కు వెల్లొచ్చిన పోశవ్వ తమ బిడ్డల పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే కూతురు చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బోరున విలపించింది. అపస్మారక స్థితిలో వైద్యం అందుకుంటున్న తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని వేడుకుంటోంది.
అరెస్ట్…
కూతురు హర్షిత హత్య, కొడుకు హర్షిత్ హత్యాయత్నం కేసులో వివిధ కోణాల్లో ఆరా తీసిన పోలీసులు తండ్రి మల్లేశమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని నిర్దారించారు. అతని కోసం గాలించిన కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 15న మర్డర్, అటెమ్ట్ మర్డర్ కు పాల్పడిన మల్లేశం ఇంటి నుండి పరార్ అయి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ ఓ లాడ్జిలో ఉన్నాడు. మరునాడు మంచిర్యాలకు చేరుకున్న నిందితుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. పోలీసులు అతని కోసం గాలించి సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ జరపగా తన బిడ్డలపై హత్య, హత్యాయత్నానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. మల్లేశంను అతని ఇంటికి తీసుకెళ్లాగా చిన్నారులకు ఉరి వేసిన టవల్ ముక్కలు చూపించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని పోలీసులు తెలిపారు.