మెటా ఫండ్ పేరిట ఘరనా మోసం… కింగ్ పిన్ అరెస్ట్ తో ఓ నెట్ వర్క్ కు బ్రేక్…

బ్లాక్ లేబుల్ మందు పార్టీలు… మభ్య పెట్టేందుకు ఏజెంట్లు…

దిశ దశ, కరీంనగర్:

సామాన్యులను నిట్ట నిలువునా ముంచాలంటే ఏం చేయాలి..? పెట్టుబడులకు భారీగా ఆదాయం వస్తుందని ఎర వేయాలి… ఇప్పుడంతా స్మార్ట్ వర్క్ కాబట్టి ఈ మార్గాన్నే ఎంచుకోవాలి… ఈ ఊబిలోకి దింపేందుకు సామాన్యులకు ఆశ చూపించేందుకు ఏజెన్సీ వ్యవస్థను తయారు చేసుకోవాలి. ఇవన్ని అనుకూలించిన తరువాత ఇంకేముంది కోట్లలో డబ్బులు వసూలు చేయడం సులువే కదా… సరిగ్గా ఇలాంటి ఘరానా గ్యాంగ్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 30 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడిన ఈ ముఠా గుట్టు రట్టు చేశారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మెటా ఫండ్’ పేరిట ఆన్ లైన్ కాయిన్ ఛీటీంగ్ దందా వివరాలను వెల్లడించారు. ఆన్ లైన్ లో మెటా ఫండ్ పేరిట యాప్ క్రియేట్ చేసి అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి రూ. 25 నుండి 30 కోట్ల వరకూ వసూలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరికి చెందిన వరాల లోకేశ్వర్ రావు (32)ను అరెస్ట్ చేశారు. సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ తయారు చేయడంలో నిపుణుడైన వరాల లేకశ్వర్ రావుకు అదే వరంగా భావించి ఆన్ లైన్ దందాకు తెరతీశాడు. కరీంనగర్ కు చెందిన తులసి ప్రకాష్ (56), బూర శ్రీధర్ (54), దాసరి రాజు (39), దాసరి రమేష్ (50), కట్ల సతీష్ (49)ల ద్వారా భారీ మోసానికి పాల్పడ్డారు. లోకేశ్వర్ రావు నకిలీ మెటాఫండ్ పేరిట ఆన్ లైన్ లో కాయిన్లను క్రియేట్ చేశారు. రూ. 90 వేలు పెట్టుబడి పెడిలే వెయ్యి కాయిన్లు ఇస్తామని… నెల రోజుల్లో మూడు రెట్ల లాభంతో అమ్మకోవచ్చని నమ్మించారు.

ఎర ఇలా…

బాధితులను నమ్మించేందుకు కూడా వీరు వ్యూహ రచన చేశారు. రిసార్టులను బుక్ చేయడం, గోవాకు తీసుకెళ్లడం, విదేశాలకు టూర్లు వేయించి ప్రలోభాల ఉచ్చులో బిగించేశారు. మొదట హైదరాబాద్ లోని బాంక్విట్ హాళ్లలో కూడా విందు, మందుతో పాటు మాయా ప్రపంచం కూడా చూపించారు. ఖరీదైన మద్యం బాటిళ్లతో విందు ఏర్పాటు చేసి తమ సంస్థ చాలా పెద్దదని కూడా నమ్మించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాధితుల నుండి నేరుగా నగదు తీసుకున్న ఈ ముఠా ఆన్ లైన్ లో నకిలీ ఐడీలను ద్వార కాయిన్లు కెటాయించారు. డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లేకుండా జాగ్రత్త పడిన వరాల లోకేశ్వర్ రావు ముఠా యాప్ తయారు చేసి భారీగా డబ్బు వసూలు చేసిన తరువాత ఆన్ లైన్ నుండి యాప్ ను తొలగించేశారు. మెటాఫండ్ ఫేక్ యాప్ పై కరీంనగర్ రూరల్, కరీంనగర్ టూ టౌన్ లలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు జరిపిన విచారణలో తులసి ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్ లను గుర్తించారు. వీరిని గతంలోనే అరెస్ట్ చేయగా తాజాగా కింగ్ పిన్ అయిన వరాల లోకేశ్వర్ రావును అరెస్ట్ చేశారు. నిందితుల నుండి నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లు, 30 తులాల బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడికి చెందిన BMW కారును కూడా సీజ్ చేశారు.

వలలో పడకండి: సీపీ గౌష్ ఆలం…

అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే ఇలాంటి ముఠాల వలలో పడి మోసపోవద్దని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రజలకు సూచించారు. ఆన్ లైన్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి ఛీటింగ్ కు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పుదోవ పట్టించే ఇలాంటి యాప్స్ గురించి కానీ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపే వారిని నమ్మవద్దన్నారు. ఇలాంటి విషయాల గురించి డయల్ 100 లేదా 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. మెటా ఫండ్ పేరిట ఛీటింగ్ కు పాల్పడిన కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.

crime newsGOUSH ALAMkarimnagar newsKARIMNAGAR POLICEOnline cheating