చెక్ పోస్టు డ్యూటీ కష్టాలకు చెక్ పెట్టేదెవరూ?

దిశ దశ, హైదరాబాద్:

పంచాయతీ ఎన్నికల్లో నగదు రవాణాను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన బార్డర్ చెక్ పోస్టుల్లో సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అసలే చలి కాలం కావడం… మరో వైపున 24 గంటల పాటూ చెక్ పోస్టుల వద్ద డ్యూటీ చేస్తుండడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆయా శాఖల యంత్రాంగం సవాళ్లు ఎదుర్కోంటోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలించే వారిని కట్టడి చేసేందుకు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. చెక్ పోస్టుల్లో ఎక్కువగా పోలీసు విభాగానికి చెందిన వారే డ్యూటీలో ఉంటున్నారు. అయితే జిల్లాల బార్డర్ వద్ద ఓ టెంట్, సైడ్ వాల్స్, కుర్చిలు, టేబుళ్లను ఏర్పాటు చేశారు. పగటి పూట విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అంతగా కష్టాలు ఎదుర్కోవడం లేదు కానీ రాత్రి వేళల్లో మాత్రం ఇక్కట్లకు గురవుతున్నారు. జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల పరిస్థితి బావున్నా… నిర్మానుష్య ప్రాంతాల్లోని చెక్ పోస్టుల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆయా చెక్ పోస్టుల వద్ద విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకటిలోనే డ్యూటీలు చేయాల్సి వస్తోంది. వాహనాలు తనిఖీ చేసినప్పుడు టార్చ్ లైట్ సాయంతో చెక్ చేస్తున్నారు. అయితే వారు విధులు నిర్వర్తిస్తున్న చోట వెలుతురు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న సిబ్బంది బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చీకటి పడినప్పటి నుండి మొదలు తెల్లవారే సరికి కూడా చెక్ పోస్టుల్లో డ్యూటీ చేస్తున్న వారంతా కూడా చీకటితోనే సహవాసం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన సంచారం లేని ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లోకి పాములు, విష కీటకాలు చొరబడితే తమ పరిస్థితి ఏమిటని అంటున్నారు. చీకటిలో ఏదైనా కీటకం కుట్టినా అది విషతుల్యమైనదా దానితో ప్రాణాపాయం ఉంటుందా లేదా అన్న విషయం తేల్చుకోలేక ఆందోళకు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎన్నికల అధికారులు ఇలాంటి చెక్ పోస్టుల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.

2025 ElectionsBorder check postELECTIONSLocal Body ElectionsPanchayat elections