డంప్ యార్డ్ ప్రక్షాళనకు శ్రీకారం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ వాసుల కల సాకారం కాబోతోంది. చిత్త శుద్దితో చెత్తను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టింది అధికార యంత్రాంగం. దశాబ్దాలుగా సేకరించిన చెత్తతో మానేరు నది తీరంలో గుట్టలుగా పేరుకపోయింది. దీనిని తొలగించేందుకు పకడ్భందీగా ప్రణాళికలు సిద్దం చేశారు బల్దియా కమిషనర్ ప్రపుల్ దేశాయ్. బయో మైనింగ్ విధానంతో చెత్తను వేర్వేరుగా చేసేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. బయో మైనింగ్ కోసం ప్రత్యేకంగా మూడు మిషన్ల ద్వారా చెత్తను రీ సైక్లింగ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. మొత్తం మూడు విభాగాలుగా బయో మైనింగ్ చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ డంప్ యార్డులో పేరుకపోయిన దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త సమీప కాలనీ వాసుల సహనానికి సవాల్ విసురుతోంది. దుర్గంధం వెద జల్లడంతో పాటు డంప్ యార్డులో తరుచూ మంటలు చెలరేగడంతో సమీప కాలనీల్లో పొగ చూరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల వాసులు కొన్ని సమయాల్లో బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. వయో భారం, అనారోగ్యంతో ఉన్న వారు పొగ కారణంగా మరింత అవస్థలు పడుతున్నారు. మానేరు తీరంలోనే డంప్ యార్డ్ ఉండడంతో నదిలోని నీరు కూడా కలుషితం అవుతోంది. కరీంనగర్ వాసులకు ప్రధాన సమస్యగా మారిన డంప్ యార్డ్ సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు పలు మార్లు వినతి చేశారు. డంప్ యార్డులోని చెత్తను బయో మైనింగ్ విధానంతో గ్రేడింగ్ చేయాలని నిర్ణయించిన అధికారులు మిషనరీ కొనుగోలు చేసినా ఆచరణలో పెట్టలేకపోయారు. తాజాగా అదనంగా మరో మిషన్ కొనుగోలు చేసిన అధికారులు చెత్తను గ్రేడింగ్ చేసే ప్ర్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రాళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గుడ్డలు, సాయిల్ ని వేర్వేరు చేసేందుకు బయో మైనింగ్ విధానం ప్రారంభించాలని నిర్ణయించారని. స్వచ్ఛ స్వరేక్షన్ నిధులు కూడా అందుబాటులో ఉండడంతో వీలైనంత తొందరలో కరీంనగర్ డంప్ యార్డ్ ప్రక్షాళన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో మిషన్ రోజుకు వంద టన్నుల మేర చెత్తను గ్రేడింగ్ చేయనున్నాయి. బయో మైనింగ్ విధానాన్ని నిరాటంకంగా కొనసాగించినట్టయితే ఏడాదిలోగానే కరీంనగర్ డంప్ యార్డ్ అంతా క్లీన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. బయో సాయిల్ ను రోడ్ల నిర్మాణానికి, రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమల్లో బాయిలర్లలో వినియోగించుకునేందుకు బావుంటుందని కూడా గుర్తించారు. ఇందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకునే పనిలో నిమగ్నం అయిన కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు సానుకూల ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

dump yardkarimnagarKarimnagar CorporationLatest News
Comments (0)
Add Comment