డాక్యూమెంట్ రైటర్లే దళారులు…

దిశ దశ, ఖమ్మం:

స్థిరాస్థుల  క్రయ విక్రయాల వ్యవహారాల రికార్డులను నమోదు చేయాల్సిన  రిజిస్ట్రేషన్ విభాగంలో అవినీతి అదికారులకు దళారులుగా  వహరిస్తున్నది ఎవరూ..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారికంగా పెత్తనం  చెలాయిస్తున్నది ఎవరూ..? ఏసీబీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చిన నిజాలు ఏంటీ..?

ఖమ్మం రూరల్ SRO

సోమవారం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 30 లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. లంచం నగదు తీసుకునేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యూమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తన కొడుకు పేరిట భూమిని గిఫ్ట్ డీడ్ చేయాలని అభ్యర్థించాడు. ఇందుకు రూ. 50 వేలు లంచం ఇవ్వాలని మధ్యవర్తి ద్వారా డిమాండ్ చేసి రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో డాక్యూమెంట్ రైటర్ భాగస్వామ్యం కూడా ఉండడంతో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

వీరికేం పని..?

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆయా సెక్షన్లకు యంత్రాంగం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది. భూ లావాదేవీలు జరుపుకునే వారికి మాత్రమై ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్లతో పని ఉంటుంది. వీరు కేవలం క్రయవిక్రయాల ఒప్పందం పత్రాలను రాసి, మ్యాప్ వేసి డాక్యూమెంట్ తయారు చేస్తారు. ఇదంతా కూడా అనధికారికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియకే పరిమితం కావల్సిన ఈ ప్రైవేటు డాక్యూమెంట్ రైటర్లే అత్యంత కీలకంగా మారిపోయారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడుగు పెట్టేందుకు కూడా అర్హత లేని వీరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు చేసినప్పుడు ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ల భాగస్వామ్యం తరుచూ వెలుగులోకి వస్తున్నది. ప్రైవేటు వ్యక్తులు ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయల్లో ఆదిపత్యం చెలాయించడం వెనక కారణమేంటన్నది ఆ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. డాక్యూమెంట్ రైటర్ల ముసుగులో అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న విషయం తేటతెల్లం అయిపోయింది. రాష్ట్రంలోని పలు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేసిన పలు సందర్భాల్లో కూడా వీరి ప్రమేయం వెలుగులోకి వచ్చింది.

పట్టించుకోవడం లేదా..?

అయితే తెలంగాణ ఏసీబీ అధికారుల దాడుల్లో ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ల మధ్యవర్తిత్వం బయటపడినప్పటికీ సదరు శాఖ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పట్టు బిగించడం వల్ల అన్ని విధాల కూడా నష్టమేనన్నది వాస్తవం. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు ఇలా ఎన్నో రకాల అంశాలు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములను క్రమబద్దీకరించే విషయంలో అవసరమైన సమాచారం సేకరించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలు ప్రైవేట డాక్యూమెంట్ రైటర్ల ద్వారా బయటకు పొక్కినట్టయితే ప్రభుత్వ లక్ష్యానికి గండి పడే ప్రమాదం కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉండే ఫైళ్ల భద్రతపై కూడా నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని అధికారులు ప్రోత్సహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసిన పలు సందర్బాల్లో డాక్యూమెంట్ రైటర్ల భాగస్వామ్యం గురించి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ప్రమేయాన్ని కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవల్సిన అవసరం కూడా ఉంది. లేనట్టయితే ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ల ఆధిపత్యం మితిమీరిపోయే ప్రమాదం ఉంది.

acb caseACB RAIDSACB searchesACB TELANGANAACB Trap