అక్రిడిటేషన్ కావాలా… అగ్రిమెంట్ ఇవ్వు..!

దిశ దశ, హైదరాబాద్:

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు పత్రికల యాజమాన్యాల ఆధిపత్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయినట్టుగా ఉంది. ఓ వైపున యాడ్స్, సర్క్యూలేషన్ టార్గెట్లు విధిస్తూనే మరో వైపున సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట అగ్రిమెంట్లు రాయించుకుంటున్నాయి కొన్ని సంస్థలు. సంస్థ ద్వారా జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు సంక్రమిస్తున్నందన, సదరు యాజమాన్యం తొలగించినా, రిపోర్టర్ వేరే సంస్థలో జాయిన్ అయినా అక్రిడిటేషన్ కార్డు, బస్సు పాస్ ను తిరిగి సంస్థ బాధ్యులకు అప్పగిస్తానని, లేనట్టయితే సంస్థ తీసుకునే చట్ట పరమైన చర్యలకు బాధ్యత వహిస్తానని ఇది తన ఇష్ట పూర్వకంగా రాసి ఇస్తున్న సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం అని రాసిన రూ. 50 విలువ చేసే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ను తీసుకుంటోంది ఓ పత్రిక యాజమాన్యం.

ఎన్నెన్ని కష్టాలో…

జర్నలిస్టు సమాజానికి అత్యంత అరుదైనదిగా మారిపోయింది ఒకే ఒకటి అక్రిడిటేషన్ కార్డు. అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్ కార్డులే అత్యంత కీలకమైనవి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కొన్ని యాజమాన్యాలు ఇప్పటికే యాడ్స్ టార్గెట్ పెట్టి జర్నలిస్టులను పిప్పి పీల్చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ చేయగానే టార్గెట్లు పెట్టి మరీ కొన్ని సంస్థలు ఒక్కో రిపోర్టర్ నుండి రూ. 50 వేల వరకు యాడ్స్ కలెక్షన్ చేశాయి. తిరిగి అక్రిడిటేషన్ కోసం లేఖలు ఇచ్చేప్పుడు టార్గెట్లు విధించాయన్న ప్రచారం కూడా జరిగింది. సంస్థ యానివర్సరీకి, పండుగ పబ్బానికి, నాయకుల బర్త్ డేలకు, ఇంకా ఎలా అవకాశం ఉంటే అలా యాడ్స్ కలెక్షన్ చేయాల్సిందేనని షరతులు పెట్టాయన్నది బహిరంగ రహస్యం. అయితే తెలుగు దినపత్రిక యాజామన్యం ఒకటి ఇప్పుడు బాండ్ పేపర్లు రాయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం విడ్డూరంగా ఉంది. సంస్థ కారణంగానే తమకు అక్రిడిటేషన్లు వస్తున్నాయని రిపోర్టర్లచే రాయించుకుంటూ… సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు తీసుకుంటున్న తీరు విచిత్రంగా ఉంది. జర్నలిస్టుల గుర్తింపు కోసం సమాచార పౌర సంబంధాల శాఖ ఇస్తున్న ఈ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో యాజమాన్యాలు ఎలా వ్యవహరిస్తున్నాయో తాజా ఘటన స్పష్టం చేస్తోంది.

అదొక్కటే ఆశ…

ఒకప్పుడు సెంటిమీటర్ చొప్పున జర్నలిస్టులకు సంస్థలు లైన్ అకౌంట్ పేరిట నెల నెల డబ్బులు ఇచ్చేవి. కానీ ఇటీవల కాలంలో సంస్థలకే రెవెన్యూ ఇప్పించాల్సిన భారం జర్నలిస్టులపై పడింది. ప్రభుత్వం కనికరించి నివేశన స్థలం ఇస్తుందేమోనన్న ఒకే ఒక్క ఆశతో జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కావాలని ఆశిస్తున్నారు. ఇదే సంస్థలకు వజ్రాయుధంగా మారిపోయి వారిని అన్ని రకాలుగా వాడుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అగ్రిమెంట్ పేపర్లు కూడా రాసే దుస్థితికి జర్నలిస్టుల పరిస్థితి చేరిందంటే ఎంతటి దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

AccreditationjournalistLatest Newstelangana newsTG NEWS
Comments (0)
Add Comment