చిన్నారుల చేతుల్లో ఉన్నవేంటో తెలుసా..?

దిశ దశ, వరంగల్:

ఓ చేతిలో చిన్న చిన్న గొట్టాలు… మరో చేతిలో పుల్లలు పట్టుకుని చిన్నారులు ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా..? ఇంతకీ అవి ఏమిటని  ఆలోచిస్తున్నారా..? బతుకమ్మ వేడుకలంటే కేవలం పుల సింగిడీలతో కనిపించే మహిళామణులే కాదు… మగ పిల్లలు కూడా ఈ సమయంలో సందడి చేసేవారు. బతుకమ్మల వద్ద మహిళలు పాటలు పాడుతూ ఆడుతూ ఉంటే… మగ పిల్లల చేతుల్లో సులాకి గొట్టాలు ఉండేవి. గ్రామ శివార్లలోని పొదల్లో దొరికే పాపిడి కాయలు కానీ, పేపర్ తడిపి కాని పెట్టి సులాకి పుల్లను ఉపయోగించి గాల్లోకి వదిలేవారు. శబ్దం చేస్తూ బయటకు వచ్చిన అవి తాకినట్టయితే దద్దర్లు వచ్చేవి. ఆకతాయిలు అమ్మాయిల వెంటపడి ఏడిపించేందుకు ఉపయోగించినప్పటికీ చాలామంది మాత్రం గాల్లోకి కాలుస్తూ బతుకమ్మ పండగప్పుడు హంగామా చేసేవారు.  అమ్మాయిలు బతుకమ్మలు పేర్చేందుకు పూల కోసం ఏ స్థాయిలో  ఆసక్తి చూపేవారో సులాకి గొట్టం ఉపయోగించేందుకు మగపిల్లలు  అంతకంటే ఎక్కువ మక్కువ చూపించే వారు. తల్లిదండ్రులు వండ్రంగుల వద్దకు వెల్లి సులాకి గొట్టం తయారు చేయించేవారు. చెక్కతో మాత్రమే చేసే సులాకి గొట్టం సాదా సీదాగా, ముందు భాగాన్ని కవర్ చేస్తున్నట్టుగా ఉండే విధంగా, వాటిపై డిజైన్ వచ్చేలా కూడా తయారు చేసేవారు వండ్రంగులు. ముందుభాగాన్ని కవర్ చేసే దానిని గిన్నె సులాకి గొట్టం అని పిలిచే వారు. చిన్నారులు గ్రామాల శివార్లలోకి వెల్లి పాపిడి చెట్ల నుండి కాయలు సేకరించుకుని వచ్చి అవి వాడి పోకుండా ఉండేందుకు నీటిలో వేసి ఉంచే వారు. సాయంత్రం బతుకమ్మ ఆట మొదలైన తరువాత సులాకి గొట్టాలకు పని చెప్పేవారు ఆ తరం పిల్లలు.

నేటికీ…

తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలప్పుడు నాటి తరం మగ పిల్లలు సులాకి గొట్టాలను వినియోగించేందుకు అంత్యంత ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చేవారు. అయితే దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వరకూ సులాకీ గొట్టాలతో ఆడేందుకు ఆసక్తి చూపేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో సులాకి గొట్టాలు దాదాపుగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే అటవీ ప్రాంతాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని పల్లెల్లో మాత్రం సులాకి గొట్టాలను వినియోగించే సాంప్రాదాయం నేటికీ కొనసాగుతోంది. సులాకి గొట్టాలను వినియోగించే సాంప్రాదాయం ఒకటి ఉండేదన్న విషయం నేటితరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. దశాబ్దాల క్రితం మాత్రం సులాకీ గొట్టాన్ని ఉపయోగించి తమ దర్పాన్ని ప్రదర్శించే వారు నాటి తరం పిల్లలు.

Latest NewssironchaSULAKI GOTTAMtelanganaTG NEWS