లెంకలగడ్డ ఘటనపై ప్రత్యక్ష్య సాక్షులు…
దిశ దశ, లెంకలగడ్డ (పలిమెల):
భారీ శబ్దం చేసుకుంటూ తుపాను గాలులను మించిన వేగంతో వస్తున్న నీటి ధారను గమనించి వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిన రైతులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. సాయంత్ర కావస్తుండడంతో ఏదో ఉపధృవం ముంచుకొస్తోందన్న విషయాన్ని పసిగట్టిన వారంతా ఒక చోటకు చేరుకున్నారు. కలిసికట్టుగా ఇండ్లకు చేరుకోవాలని భావిస్తున్న క్రమంలోనే ఆ నీటి సుడి గండం వారిని చుట్టుముట్టి మూడు నాలుగు సార్లు గాల్లోకి లేపి ఎత్తేసింది. 15 నుండి 20 ఫీట్ల ఎత్తు వరకూ గాల్లోకి లేచిన ఆ రైతులంతా తాము బ్రతకడం కష్టమేనని అనుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి క్షణం వరకూ తమవంతు ప్రయత్నాలు చేసి బ్రతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ప్రకృతి విలయతాండవంలో చిక్కుకున్న రైతులు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు ఇవి.
మంగళవారం సాయంత్రం అనూహ్యంగా గోదావరి నది నుండి మూడు ఎకరాల మేర వెడల్పుతో భారీ శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటిధార (వాటర్ స్పౌట్) వలలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు నలుగురు రైతులు. గ్రామానికి చెందిన భండారి సారక్క, మధుసూధన్, ఇస్మాయిల్, మడుప మాంతయ్యలు లెంకలగడ్డ శివార్లలోని తమ పంటపొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. తాము సాగు చేస్తున్న పత్తి, మిర్చి పంటల్లో కలుపు తీయడంతో పాటు పురుగుల మందుల పిచికారి చేస్తున్న ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పు వారి ప్రాణాలను మింగేసినంత పనిచేసింది. అత్యంత వేగంతో భారీ శబ్దం చేసుకుంటూ నీటి ధార ఆకాశాన్ని తాకుతూ తమ వైపు దూసుకవచ్చిందని వివరించారు. ఒక్కసారిగా తమను చుట్టుముట్టిన వాటర్ స్పౌట్ లో చిక్కుకున్న తమ ప్రాణాలు పోయినట్టేనని, పంట చేలల్లోనే విగత జీవులుగా మారిపోతామని అనుకున్నారు. అంతలోనే నీటి ధార తమను రెండు మూడు సార్లు గాల్లోకి ఎత్తి పడేయడంతో ఇక తమ పని అయిపోయిందని అనుకున్నప్పటికీ కలిసి కట్టుగా ఉంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. మూడోసారి నేలపై పడగానే నలుగురు రైతులు కూడా సమీపంలోని ఓ చెట్టు వద్దకు చేరుకుని దానిని అల్లుకపోయారు. వాటర్ స్పౌట్ ఉధృతికి చెట్టు కొమ్మలు విరిగినప్పటికీ అవి దూరంలో పడడంతో తాము సేఫ్ అయ్యామని రైతులు వివరించారు. ఆ తరువాత నేలపై పడుకుని స్వీయ రక్షణ కోసం తీవ్రంగా శ్రమించామని, అయినప్పటికీ తమ వైపు నీటి ధార వచ్చి ముంచెత్తుతుందేమెనన్న భయంతోనే కాలం వెల్లదీశామన్నారు. మద్యాహ్నం 3.30 గంటల సమయం నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రకృతి విలయతాండవంలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశామన్నారు. ప్రభావం తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఇంటి బాట పట్టామని బాధిత రైతులు వివరించారు. అయితే భయం గుప్పిట చేరుకున్న తాము ఇంటికి ఎలా చేరుకున్నామో కూడా తెలియలేదని, తమ కుటుంబ సభ్యులను చూసిన తరువాత కానీ తాము సంతృప్తి చెందలేకపోయామన్నారు.
నేడు ఇలా…
మంగళవారం సాయంత్రం ప్రకృతి చేసిన బీభత్సపు కోరల నుండి తప్పించుకున్న తాము సేఫ్ అయ్యామన్న సంతోషం తమలో లేకుండా పోయిందని లెంకలగడ్డ రైతులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పంటచేల వద్దకు చేరుకుని పరిశీలిస్తే పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నాశనమయ్యాయయని తెలిపారు. వ్యవసాయం చేసేందుకు తీసుకొచ్చిన స్ప్రే మిషన్లు, ఇతరాత్ర సామాగ్రి అంతా కూడా వాటర్ స్పౌట్ ధాటికి ధ్వంసం అయ్యాయని వివరించారు. ఇంతటి భయానక పరిస్థితులు తాము ఏనాడూ చూడలేదని తెలిపిన రైతులు లక్షలాది రూపాయల విలువ చేసే పంటలన్ని దెబ్బతిన్నాయన్నారు. సాగు భూములపై ప్రకృతి చేసిన ప్రకోపం వల్ల తమకు అప్పులు మాత్రమే మిగిలాయని తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.