అనధికారికంగా బ్రాంచ్ ఆఫీసులు..? భవిత శ్రీ చిట్స్ తీరు…

దిశ దశ, కాటారం:

లిమిటెడ్ కంపెనీ పేరిట చిట్ ఫండ్ నిర్వహించిన భవిత శ్రీ యాజమాన్యం నిబంధనలు పాటించ లేదా..? చిట్ సభ్యులకు సేవలు అందిస్తున్నామన్న బూచి చూపించిన యాజమాన్యం చిట్స్ రిజిస్ట్రార్ అధికారులను కూడా తప్పుదారి పట్టించిందా..? నిబంధనలు పాటించకుండా సంస్థ  వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాటారం బ్రాంచ్…

తాజాగా కాటారం పోలీసులకు పెంట రజని తనకు భవిత శ్రీ చిట్స్ యాజమాన్యం మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సంస్థ ఇష్టారీతిన వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. కాటారంలో ప్రత్యేకంగా బ్రాంచ్ కార్యాలయం ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని బాహాటంగానే చెప్పుకున్న సంస్థ అంతర్గతంగా మాత్రం నిబంధనలను కాల రాసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రజని కాటారం బ్రాంచ్ పరిధిలో రూ. 5 లక్షల చిట్ లో
సభ్యురాలిగా జాయిన్ అయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెద్దపల్లిలోని బ్రాంచ్ కార్యాలయంలో చిట్ ఎత్తుకున్నారని డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆమెతో పాటు ష్యూరిటీ దారులకు సంస్థ లీగల్ నోటీసులు పంపించడం గమనార్హం. రజనితో పాటు మరి కొందరికి కూడా భవిత శ్రీ చిట్ సంస్థ తరుపున న్యాయవాదులు లీగల్ నోటీసులు పంపించారు. కొంతమంది కరీంనగర్ బ్రాంచ్ పరిధిలో నిర్వహించిన చిట్ లో సభ్యులుగా, మరి కొంతమంది పెద్దపల్లి బ్రాంచ్ కార్యాలయంలో చిట్ సభ్యులుగా ఉన్నారని చూపించడం గమనార్హం. కాటారంలో బ్రాంచ్
కార్యాలయం అనధికారికంగానే భవిత శ్రీ చిట్స్ యాజమాన్యం కొనసాగించినట్టుగా లీగల్ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అయితే చిట్ సభ్యులకు ఇచ్చిన పాస్ బుక్కులపై మాత్రం కాటారం, గారెపల్లి బ్రాంచ్ ఆఫీసు అని దర్జాగా పేర్కొనడం గమనార్హం.

నోటీసులు…

ముఖ్యంగా భవిత శ్రీ చిట్స్ యాజమాన్యం సాధారణ సభ్యులను భయాందోళనలకు గురి చేసే విధంగా వ్యవహరించిందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిట్ సభ్యులకు లీగల్ నోటీసులు పంపించడంతో తాము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని, సంస్థ వద్ద ఉన్న రికార్డులు చూపించి ఎక్కువ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న భయాన్ని కల్పించేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు బాధితులు. బ్రాంచ్ కార్యాలయాన్ని అధికారికంగా ఏర్పాటు చేయకుండా సభ్యులను చీట్ చేసిన సంస్థ ప్రతినిధులు ఇతర బ్రాంచ్ పరిధిలో చిట్ సభ్యులుగా ఉన్నారని, మీరంతా డిఫాల్టర్లని పేర్కొంటూ లీగల్ నోటీసులు పంపించడం వెనక సంస్థ భారీ స్కెచ్ వేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఆర్థిక లావాదేవీలు…

మరో వైపున కొంతమంది చిట్ సభ్యులకు డబ్బులు ఇచ్చామని అగ్రిమెంట్ పేపర్లు రాయించుకుని లీగల్ నోటీసులు పంపిస్తున్న సంస్థ వారికి డబ్బులు ఎలా చెల్లించిందన్న విషయాన్ని
కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సంస్థలో చిట్ పాట పాడి డబ్బులు తీసుకున్నారని వాటిని చెల్లించలేదని నోటీసులు పంపించిన యాజమాన్యం అసలు సభ్యులకు డబ్బులు ఎలా చెల్లించిందన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. చిట్ సభ్యులకు చెక్కుల ద్వారా కానీ బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయడం వంటి లావాదేవీల ద్వారా మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా డబ్బులు ఇవ్వడం నిబంధనలకు విరుద్దమేనన్నవాదనలు  వినిపిస్తున్నాయి. చిట్ ఎప్పుడు ప్రారంభించారు..? ఎప్పుడు ముగిసింది..?
ఎన్ని నెలల పాటు సభ్యుల నుండి డబ్బులు వసూలు చేశారు..? సదరు చిట్ లో ఎంతమంది సభ్యులకు డబ్బులు చెల్లించారు..? సంస్థకు ఎంతమంది డబ్బులు చెల్లించలేదు అన్న వివరాలను పరిశీలించినట్టయితే వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని సభ్యులు అంటున్నారు. చిట్ గడువు ముగిసే సమయంలో డబ్బులు ఎత్తుకున్న వారు ఎంత చెల్లించాల్సి ఉంటుంది..? సంస్థ పంపించిన నోటీసులకు వాస్తవాలకు పొంతన ఉందా లేదా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాటారం బ్రాంచ్ పరిధిలో డిఫాల్టర్లు చాలా మంది ఉన్నట్టయితే సంస్థ బ్రాంచ్ ఆఫీసును ఎత్తేయడానికి కారణం ఏంటీ..? కాటారంలో అసలు బ్రాంచ్ కార్యాలయాన్నే అధికారికంగా ఏర్పాటు చేయలేదని లీగల్ నోటీసులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కూడా జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు బాధితులు.

Chit fundscrimeLatest Newstelangana newswarangal