మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై నమోదైన కేసుల వివరాలివే…

జ్యూడిషియల్ రిమాండ్ విధించిన మంచిర్యాల కోర్ట్

ఆదిలాబాద్ జిల్లా జైలకు తరలింపు…

దిశ దశ, మంచిర్యాల:

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ తో పాటు అరెస్ట్ అయిన మిగతా వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మంచిర్యాల కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా జైలుకు ఆయన్ని తరలించారు పోలీసులు.

కేసుల వివరాలివే…

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 40/2026Aలో సెక్షన్ 189(3), 191(2), 191(3), 121(2), 223 r/w 190 BNS యాక్టులో కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, గొడిసెల రాజ రమేష్, దోమకొండ అనిల్, రామిడి లక్ష్మీకాంత్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవిందర్ రెడ్డి, బండారి సురి బాబు మరి కొంతమంది నిందితులుగా ఉన్నారు. వీరిలో గొడిసెల రాజ రమేష్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవిందర్ రెడ్డి, బండారి సురిబాబులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 17న క్యాతన్ పల్లిలోని మారుతి నగర్ ఫ్లైఓవర్ వద్ద దేవాపూర్ ఎస్సై ఏ గంగారం పోలీసు సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాతన్ పల్లి మునిసిపల్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫ్లై ఓవర్ వద్ద బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. 10.30 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన సహచరులు, సీపీఐ నాయకులతో అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేని కారణంగా బాల్క సుమన్ తో పాటు మిగతా బీఆర్ఎస్, సీపీఐ నాయకులు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పోలీసులతో వాగ్వాదం చేస్తన్న క్రమంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీలను గమనించి ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకంగా నినాదలు చేస్తూ రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 4494 అనే నంబర్ పోలీస్ కానిస్టేబుల్ డి రాకేష్ కు గాయాలయ్యాయి. రాకేష్ కు ఫ్యాక్చర్స్ కావడంతో పాటు తలకు బలమైన గాయం కాగా అతనికి మంచిర్యాలలో ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తలరించడం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్సై ఎస్ రాజశేఖర్ ల చేతులకు, వేళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష్య సాక్షుల వాంగ్మూలం తీసుకోవడం జరిగిందని, గాయాలు తీవ్రంగా అయినట్టుగా మెడికల్ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగిందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

మరో కేసులో…

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 41/2026లో సెక్షన్ 189(3), 191(2), 191(3), 118(1), 324(5), 223 r/w 190 BNS యాక్టులో ఓ కేసు నమోదయింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, గొడిసెల రాజ రమేష్, చెన్నూరుకు చెందిన అనిల్, మేడిపల్లి సంపత్, జె రవిందర్, గాజుల చంద్రకిరణ్, గోగుల రవిందర్ రెడ్డి, మేకల దాసు, నస్పూరి శివ కుమార్, కుర్మ దినేష్, అలుగుల సత్తయ్య, అలుగుల శ్రీలత, రామిడి కుమార్, రామిడి లక్ష్మీకాంత్, సంతోష్, బెల్లం అశోక్, ముస్తాఫా, బెల్లం అరుణ్, సీపెల్లి సాగర్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు నిందితులని ఎఫ్ఐఆర్ లో వివరించారు. ఈ నెల 17న క్యాతన్ పల్లి మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వేసేందుకు మంచిర్యాల నుండి మంత్రి జి వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు TS01EJ 3033 వాహనంలో బయలు దేరారు. క్యాతన్ పల్లిలోని మారుతి నగర్ ఫ్లై ఓవర్ సమీపంలోకి చేరుకోగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశ్యపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి వివేక్ ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వాహనం అద్దంతో పాటు బానెట్ కూడా దెబ్బ తినగా మందమర్రికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జావిద్ తో పాటు కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. రామకృష్ణాపూర్ ప్రగతి కాలనీకి చెందిన గోపు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న బాల్క సుమన్ పై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జ్యుడిషియల్ రిమాండ్…

క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురికి మంచిర్యాల కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా వారిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.

ఉద్రిక్తత…

బుధవారం ఉధయం నుండే చెన్నూరు నియోజకవర్గంలో పోలీసులు పలుచోట్ల మోహరించారు. బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులు పహారా కాయగా, బీఆర్ఎస్, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే మంగళవారం నాటి ఘటనకు నిరసనగా క్యాతన్ పల్లి బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారేమోనని అనుకున్నారంతా. మంగళవారం క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలపై నమోదయిన కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకున్న తరువాత కూడా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మంచిర్యాల కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తరువాత కూడా సుమన్ తో పాటు మిగతా వారిని జైలుకు తరలించే క్రమంలో కూడా ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

BALKA SUMANBRS NEWScrimeKYATHANPALLYMANCHERIAL
Comments (0)
Add Comment