దిశ దశ, హైదరాబాద్:
షటిల్ బ్మాడ్మింటెన్ ఆడుతున్న ఆయన ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. బ్మాడ్మింటెన్ కోర్టులోనే అచేతనావస్థతో విగతజీవిగా మిగిలాడు. సంఘాటనా వివరాల్లోకి వెల్తే… ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ (25) హైదరాబాద్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి రోజూ బ్యాడ్మింటెన్ ఆడే రాకేష్ సోమవారం ఉదయం కూడా ఇదే విధంగా కోర్టులో గేమ్ ఆడుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్క సారిగా రాకేష్ కుప్పకూలిపడిపోవడంతో సహచరులంతా ఆందోళనకు గురయ్యారు. సీపీఆర్ చేసిన అనంతరం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆయన తండ్రి గుండ్ల వెంకటేశ్వర్లు తల్లాడ పంచాయితీ ఉప సర్పంచ్ గా గతంలో పని చేశారు. తమతో కలిసి అప్పటి వరకు షటిల్ ఆడిన తమ స్నేహితుడు విగత జీవిగా మారిపోయిన తీరు చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాకేష్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం అలుముకుంది.