కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
దిశ దశ, కరీంనగర్:
కమిషన్ల కోసం తమ అకౌంట్లను అద్దెకు ఇచ్చే విధానంపై స్పెషల్ నజర్ వేశారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకుని వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టారు. కమిషన్లకు ఆశపడి తమ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు జరిపే లావాదేవీల కోసం అప్పగిస్తున్న తీరును గుర్తించేందుకు ఆపరేషన్ క్రాక్ డౌన్ చేపట్టారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం ఆద్వర్యంలో ఇందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. గురువారం మ్యూల్ అకౌంట్ల కట్టడిపై రివ్యూ జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… బ్యాంకర్ల సమన్వయంతో మ్యూల్ ఖాతాదారులకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. నెలవారి కమిషన్లు ఇస్తామని ఆశచూపి బ్యాంకు అకౌంట్లను వినియోగించుకుంటామని చెప్పే వారి పట్ల అప్రతమత్తంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానస్పద లావాదేవీలు జరిగినట్టయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
34 అకౌంట్లు…
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 మ్యూల్ అకౌంట్లను గుర్తించారు. NCRP పోర్టల్ ద్వారా 162 ఫిర్యాదులు అందగా వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేసిన పోలీసులు 112 BNS యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అపరిచితులు ఇచ్చే కమిషన్లకు ఆశ పడుతున్న కొందరు తమ బ్యాంకు అకౌంట్లు, వాటికి లింక్ అయిన ఫోన్ నంబర్లను అందిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సైబర్ క్రిమినల్స్ బాధితుల నుండి దోచుకున్న నగదును మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసి తమ అవసరాలకు వాడుకుంటున్నారని సీపీ గౌష్ ఆలం వివరించారు. అపరిచితులు చేసే లావాదేవీల కోసం వ్యక్తిగత అకౌంట్లు అప్పగించడం చట్టరిత్యా నేరమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, అలాంటి వారు సైబక్ క్రిమినల్స్ కు సహకరిస్తున్నట్టుగా పరిగణిస్తామన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.