ఇసుక రీచుల్లో లోండింగ్ ఛార్జీల వసూళ్లు… కాంట్రాక్టర్లు Vs లారీ ఓనర్లు…

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆద్వర్యంలో సాగుతున్న ఇసుక వ్యాపారంలో లారీ యజమానులు, కాంట్రాక్టర్లకు మధ్య అగాథం ఏర్పడినట్టుగా స్పష్టం అవుతోంది. లోడింగ్ కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

లారీ ఓనర్ల వాదన…

ఇసుక రీచుల్లో లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేయడం వల్ల తమపై భారం పడుతోందని లారీ ఓనర్లు అంటున్నారు. ఈ మేరకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భూగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు యూనియన్ ప్రతినిధులు. ఇసుక రీచుల్లో కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి పాల్పుడుతున్నారని, ఒక్కో లారీకి రూ. 3 వేల నుండి రూ. 3,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వే బిల్లుతో పాటు లోడింగ్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించినప్పటికీ అదనపంగా కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారని లారీ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. తాము ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన లారీల్లో ఇసుక లోడ్ చేయకుండా పక్కకు పెట్టిస్తున్నారని, ఈ విషయం గురించి టీజీఎండీసీ అధికారులు కూడా చెప్పినా కాంట్రాక్టర్లు వినిపించుకోవడం లేదంటున్నారు. తెలంగాణాలోని ఓ ఇసుక రీచుకు వెళ్లినా లారీల వద్ద అదనంగా చార్జీలు వసూలు చేసే విధానాన్ని కట్టడి చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఉపాధ్యక్షుడు ఎండీ సలాలుద్దీన్ ఆ వినతి పత్రంలో అభ్యర్థించారు. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీఎండీసీ ఎండీలు సొంత జేసీబీల ద్వారా లోడింగ్ చేయించారని ఇప్పుడు అదనంగా వసూలు చేస్తున్న విధానం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని వివరించారు. ఇసుక రీచుల్లో సాగుతున్న దౌర్జన్యాన్ని కట్టడి చేసి అదనపు వసూళ్లను నిలిపివేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.

వైరల్ అవుతున్న లేఖ…

మరో వైపున తెలంగాణ లారీ యజమానలు సంఘం ప్రతినిధులు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతి పత్రం ఇచ్చిన తరువాత ఇసుక రీచులకు సంబంధించిన మరో లేఖ కూడా వైరల్ అవుతోంది. లారీ ఓనర్ల పేరిటనే విడుదలైన ఈ లేఖలో తాము అదనపు డబ్బులు చెల్లించలేమని చెప్పిన తరువాత కాంట్రాక్టర్లు లోడింగ్ డబ్బులు చెల్లించనట్టయితే తాము రీచులు నడపలేమని చెప్పారన్నారని, దీంతో ఇరు వర్గాలు నష్టపోకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. టీజీఎండీసీ ఎండీ, జీఎం, పీఓల సమక్షంలో తీసుకున్న తుది నిర్ణయం ప్రకారం లోడింగ్ కోసం రూ. 1000, కాంటా, జేసీబీ, సీరియల్ కోసం రూ. 500 మొత్తం రూ. 1500 లారీ యజమానులు రీచుల నిర్వాహాకులకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు లారీ యజమానులు, డ్రైవర్ లు ఒక్కో లారీకి రూ. 1500 మాత్రమే చెల్లించాలని లేనట్టయితే జీఎం, ఎఆర్ఓ, పీఓలను సంప్రదించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఆ డబ్బులో మరి..?

మెట్రిక్ టన్నుకు రూ. 375చొప్పున లారీ యజమానులు ఇసుక కోసం డీడీలు తీసినప్పుడు చెల్లిస్తున్నారు. అయితే అవి నేరుగా టీజీ ఎండీసీ అకౌంట్ లో జమ అవుతున్నాయి. ఈ డబ్బులను తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ విభాగం నుండి సంబంధిత రీచుల నిర్వాహకులకు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే లోడింగ్ ఛార్జీలు తమకు రాకపోవడం వల్లే తాము రీచుల వద్ద వసూలు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు అంటున్నారని లారీ ఓనర్ల సంఘం ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. లారీల సామర్థ్యాన్ని బట్టి లోడింగ్ ఛార్జీలను అధికారికంగా టీజీఎండీసీ వసూలు చేసుకుంటున్నప్పటకీ రీచుల నిర్వాహకులకు ఆ డబ్బులు చేరడం లేదన్న సాకుతో అదనంగా వసూలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఇసుక రీచుల యజమానులు నేరుగా వసూలు చేస్తున్న లోడింగ్ ఛార్జీలతో పాటు భవిష్యత్తులో టీజీఎండీసీ చెల్లించే లోడింగ్ చార్జీలు కూడా వసులు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రెండు విధాలుగా కాంట్రాక్టర్లే లాభం పొందుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున టీజీఎండీసీ వసూలు చేస్తున్న లోడింగ్ ఛార్జీలు సరిపోవడం లేదని వెహికిల్స్ మెయింటనెన్స్ చేయలేకపోతున్నామన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే అధికారికంగా లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నందున అదనంగా భారం పడుతున్న డబ్బులు వసూలు చేసుకోవాలి కానీ టీజీఎండీసీ నిర్ణయించిన ధరకు రెట్టింపు ఛార్జీలను నేరుగా కలెక్ట్ చేస్తుండడం ఎంతవరకు సమజసం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీజీఎండీసీ వెంటనే లోడింగ్ ఛార్జీలను కాంట్రాక్టర్లకు చెల్లించనప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇవ్వనుందని దీంతో అటు టీజీఎండీసీకి, ఇటు రీచుల నిర్వాహకులకు రెండు విధాలుగా డబ్బులు చెల్లిస్తూ అదనపు భారాన్ని లారీల యజమానులే మోయాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

కాంట్రాక్టర్ల మీటింగ్..?

అయితే లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేయడం, లారీకి రూ. 1500 చెల్లించాలని టీజీఎండీసీ అధికారులు, ఓనర్లు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఇసుక రీచుల కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తమపై ఆర్థిక భారం పడుతున్నందున ఒక్కో లారీకి కనీసం రూ. 2500 వరకు అయినా చెల్లించాల్సిందేనన్న డిమాండ్ తెరపైకి తీసుకరావాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే కాంట్రాక్టర్లు ఇచ్చే ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నదే ఇసుక వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

lorry ownersSand Contractorssand lorrysSAND REACHESTGMDC