వర్గపోరు… నాయకత్వ లేమి…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ చతకలిపడిపోయింది. పెద్ద దిక్కు లేకుండా పోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఉత్తర తెలంగాణ అనగానే కరీంనగర్ గుర్తుకు వస్తుంది. అలాంటి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. అభ్యర్థుల ఎంపిక నుండి మొదలు ప్రచార పర్వం వరకూ కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి స్ఫష్టంగా కనిపించింది. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించి కరీంనగర్ లో మునిసిపల్ ఎన్నికల సమీకరణాలు నెరపాలని ప్రయత్నించిన చివరకు నామ మాత్రపు స్థానాలతో సరిపెట్టుకుంది.
నాయకత్వ లేమి…
ప్రధానంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఒంటి చేత్తో పార్టీని నడిపించిన ఘనకీర్తిని మూటగట్టుకున్న ముఖ్య నాయకులు సొంత జిల్లాలకే పరిమితం అయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుండే వ్యూహాత్మకంగా పావులు కదిపి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సారి కరీంనగర్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు అంతంత మాత్రమే. కీలక సమావేశాలకు హాజరైన నాయకులు చివరి నాలుగైదు రోజుల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగలేదన్నది నిజం. దీంతో మొక్కుబడి చర్యలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకున్న పరిస్థితి కనిపించింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుండి ముఖ్య భూమిక పోషించలేదు. అధిష్టానం కూడా కరీంనగర్ ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నాయకులను పురమాయించేందుకు చొరవ తీసుకోకపోవడమూ ఓ కారణమని చెప్పకతప్పదు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రి శ్రీధర్ బాబు కొన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహించడంతో పాటు సమీకరణాలు నెరపడం కొంతమేర లాభించింది. లేనట్టయితే మరిన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కోల్పోయేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎవరికి వారే…
కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జిగా వెలిచాల రాజేందర్ రావుకు బాధ్యతలు అప్పగించినప్పటికీ తుది నిర్ణయం తీసుకునే పరిస్థితి ఆయనకు లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ కొంతమంది స్థానిక నేతలు పట్టుబట్టడం కూడా పార్టీ గెలుపును శాసించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. చివరకు ఫైనల్ జాబితాలోనూ పేర్లు మార్చి తమ వారికి బీఫారం ఇవ్వాల్సిందేనని ఒకరిద్దరు పట్టుబట్టినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంతకం చేసిన తరువాత కూడా తమ అనుకూలమైన వారికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన సందర్భాలూ ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. బలమైన అభ్యర్థులా కాదా అన్న విషయాన్ని విస్మరించి తమ ఆధిపత్యాన్ని ప్రధర్శించాలని పట్టుబట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ విఫలానికి ఓ కారణమని తెలుస్తోంది. స్థానిక నాయకత్వం మధ్య నెలకొన్న అంతరం, ఆధిపత్య పోరు కారణంగా జట్టుకట్టి పనిచేసిన దాఖాలాలే కనిపించలేదు. వెలిచాల రాజేందర్ రావుకు బాధ్యతలు అప్పగించిన తరువాత కొంతమంది నాయకులు కినుక వహించారని పార్టీ వర్గాల సమాచారం. అయితే పార్టీ అవసరాలను తీర్చేగలిగే నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల అధిష్టానం కూడా వెలిచాల వైపే మొగ్గు చూపింది. అదిష్టానం నిర్ణయానికి అనుకూలంగా నాయకులు వ్యవహరించకపోవడం పార్టీ పతనానికి కారణమన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
అదిష్టానం కూడా…
పీసీసీ పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న నాయకత్వం కాకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించినట్టయితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది. చొప్పదండి పర్యటనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమన్వయం లేకుండా పని చేస్తున్నారని నాయకులతో అన్నట్టుగా సమాచారం. ఆ తరువాత ముగ్గురు మంత్రులు సమావేశం అయినప్పటి్కీ కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా మాత్రం పావులు కదిపేందుకు తీసుకున్న చొరవ మాత్రం అంతంత మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి కానీ, పీసీసీ చీఫ్ కానీ కరీంనరగ్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను సీనియర్ నాయకునికి అప్పగించినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అదొక్కటే…
కరీంనగర్ బల్దియాలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అందించిన సంతోషం ఒకే ఒక్కటని చెప్పాలి. గత పాలకవర్గంలో ఏ మాత్రం ప్రాతినిథ్యం లేని కాంగ్రెస్ పార్టీ ఈ సారి డబుల్ డిజిట్ సాధించిందన్న సంబరం అయితే మిగిలింది.