దిశ దశ, హైదరాబాద్:
సైబర్ క్రిమినల్స్ మరోసారి హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ ను టార్గెట్ చేశారు. ఆపదలో ఉన్నానని తనకు ఆర్థిక సాయం చేయాలంటూ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అభ్యర్థిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా రిక్వెస్ట్ వెళ్లడంతో ఓ స్నేహితుడు రూ. 20 వేలు సైబర్ క్రిమినల్స్ ఖాతాకు పంపించారని కూడా వివరించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసిన సీపీ సజ్జనార్ తనకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీ https/www.facebook.com/share/1DHPndApWj/. మాత్రమేనని ఇతరాత్ర అకౌంట్లు ఏవీ కూడా తనవి కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మిగతా అకౌంట్లన్ని కూడా నకిలీవేనని ఆయా ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీం తొలగించే పనిలో నిమగ్నం అయిందని వివరించారు. తన పేరిట, ఏ అధికారి, ప్రముఖుల పేరుతో ఫేస్ బుక్ ద్వారా వచ్చే రిక్వెస్టులకు స్పందించవద్దని సూచించారు. అనుమానస్పద లింకులు, మెసేజులు, వీడియో కాల్స్ ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని కోరారు. సైబర్ మోసాలపై వెంటనే 1930కు లేదా www.cybercrime.gov.in ద్వారా అయినా ఫిర్యాదు చేయాలన్నారు. జాగ్రత్తగా ఉన్నప్పుడే సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కకుండా డబ్బును కాపాడుకోగలుగుతామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హైదరాబాద్ సీపీ సోషల్ మీడియా వేదికగా సూచించారు.
https://www.facebook.com/share/1F1pt9dptX/