రెండు పంథాలపై పోరాటం నిజమే… సోనూ దాదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…

సికాస కార్యదర్శి అశోక్ పేరిట ప్రకటన

దిశ దశ, పెద్దపల్లి:

మావోయిస్టు పార్టీలో రెండు పంథాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమేనని, కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యుడు సోనూ అలియాస్ అభయ్ చేసిన శాంతి ప్రతి పాదనను సికాస సమర్థిస్తున్నదని కార్యదర్శి అశోక్ వెల్లడించారు. బుధవారం ఆశోక్ పేరిట విడుదల అయిన ఈ ప్రకటనలో రెండేళ్లుగా పార్టీలో రెండు పంథాల మధ్య ఘర్షణ జరుగుతోందని ఇలాంటి వాతావరణం అభివృద్దికరమైనదన్నారు. కేంద్ర కమిటీ నిర్వహించిన పలు సమావేశాల్లో పార్టీ అవలంభిస్తున్న వ్యూహం ఎత్తుగడల గురించి లోతైన చర్యలు జరిగినప్పటికీ అందుకు అనుగుణంగా మార్చుకోవడంలో కేంద్ర, రాష్ట్ర కమిటీలు విఫలం అయ్యాయన్నది కూడా వాస్తవమేనని అశోక్ వెల్లడించారు. వాస్తవ పరిస్థితులతో పొసగని తప్పుడు ఆచరణ కొనసాగడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ అభయ్ పేరిట విడుదల చేసిన శాంతి చర్చల ప్రతిపాదనలను, ఆ తరువాత సోను (అభయ్) పేరిట విడుదల చేసిన ప్రకటనలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకుండా పోలీసు ఆపరేషన్లు, ఎన్ కౌంటర్లు కొనసాగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ భారత ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని అవలంభించడం ఏ రకంగానూ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక ప్రజా యుద్ద మార్గంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిన ఈ స్థితిలో ఆయుధాలను త్యజించి రాజ్యంగ పరిధిలో చట్టబద్దంగా ప్రజా సమస్యలపై పని చేస్తూ రాజ్యాధికారం లక్ష్యంగా విప్లవ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే సరైన ఎత్తుగడగా సికాస భావిస్తోందన్నారు. మెజారిటీ పార్టీ యూనిట్లు శాంతిని నెలకొల్పడం, సాయుధ పోరాటాన్ని విరమించడమనే విషయంలో సానుకూల వైఖరిని వ్యక్త పరుస్తున్నాయని సికాస కార్యదర్శి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో సభ్యుడు సోను చేసిన శాంతి చర్చల ప్రతిపాదనలను సికాస సమర్థిస్తోందన్నారు. మావోయిస్టు పార్టీ యొక్క ఆచరణపై సుదీర్ఘ కాలం నుండి తెలంగాణ ప్రజలు లోతైన అవగాహన కల్గి ఉన్నారని, వారు రాజకీయంగా చైత్యనవంతులని, అభ్యుదయ భావాలను ఎల్లప్పూడు ఆదరిస్తారన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యం కారణంగానే సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామిక ఉద్యమాలు కొనసాగుతున్నాయని, పార్టీని, క్యాడర్ ను రక్షించుకోవడం కోసం సాయఉధ పోరాటం వదిలి చట్టబద్ద పోరాటాలలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అశోక్ వివరించారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో తాము తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకోవాలని అశోక్ కోరారు. శాంతి ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి శాంతి ప్రక్రియను, సాయుధ పోరాట విరమణను ఆమోదించిన వారు సికాసతో సంప్రదింపులు జరపాలని సూచించారు. మెజార్టీ పార్టీ వైఖరిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కోసం తమతో శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోవాలని అశోక్ కోరారు. ఇందుకు అనువైన వాతావరణం నెలకొల్పాలని, ప్రభుత్వం ప్రతినిధి వర్గాన్ని ప్రకటించినట్టయితే మావోయిస్టు పార్టీ తరుపున కూడా ప్రతినిధులను ఏర్పాటు చేసి ఆయుధాలను వదిలేసి శాంతియుతంగా చట్టపరిధిలోకి పార్టీని తీసుకవచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని సికాస కార్యదర్శి అశోక్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

abhay @ sonu dadaDANDKARNYAMmaoist newsMAOIST PARTYPeace talks