పంచాయితీ ఎన్నికల ప్రచారంలో బుల్లి తెర నటులు…

దిశ దశ, భూపాలపల్లి:

పంచాయితీ ఎన్నికల్లో గెలవాలన్న సంకల్పంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వేస్తున్న ఎత్తులు అన్నిఇన్ని కావు. ఓటర్లను ప్రాపకం చేసుకునేందుకు అభ్యర్థులు హామీలు ఇస్తూ… వ్యక్తిగతంగా ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని గ్రామాల అభ్యర్థులు అయితే హామీలకు సంబంధించి ప్రమాణ పత్రాలను రాసి మరీ ఓటర్లకు పంచుతున్నారు. మరో గ్రామంలో అభ్యర్థిని తాను గ్రామ అభివృద్ది చేయనట్టయితే కులానికో చెప్పు చొప్పున దండ తయారు చేసుకుని తన మెడలో వేసుకుని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తమ పార్టీ నాయకులచే కూడా ప్రచార పర్వం కొనసాగించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు ఆయా గ్రామాల అభ్యర్థులు. అయితే జిల్లాలోని ఓ అభ్యర్థి ఏకంగా బుల్లి తెర నటులచే ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేపడం గమనార్హం. జిల్లాలోని మహదేవపూర్ మండల కేంద్రం నుండి బరిలో నిలిచిన కేదారి గీతాబాయి బబర్దస్త్ వెంకి మంకీచే ప్రచారం చేయిస్తున్నారు. గీతాబాయికి మద్దతు ఇవ్వాలంటూ వెంకీ మంకీ పిలుపునిచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేయడం… సామాజిక వర్గాల వారిగా సమీకరణాలు నెరపడం, తమ పార్టీల ముఖ్య నాయకులచే ప్రచారం చేయించడం వంటి క్యాంపెయిన్ స్థానిక ఎన్నికల్లో సర్వ సాధారణం. కానీ మహదేవపూర్ సర్పంచ్ అభ్యర్థి కేదారి గీతాబాయి మాత్రం ఏకంగా టీవీ నటులచే ప్రచారం చేస్తుడడం గమనార్హం. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాత్రమే వెండి తెర, బుల్లి తెర నటులను ప్రచారం కోసం వినియోగించుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా వీరిని భాగస్వాములు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మారుమూల మండల కేంద్రంలో కూడా టీవీ ఆర్టిస్టుల ద్వారా ప్రచారం చేయిస్తుండడంతో కొత్త ఒరవడి మొదలు పెట్టినట్టయింది.

BHUPALPALLYelections 2025jabardasthmahadevpurPanchayat elections