దిశ దశ, హైదరాబాద్:
బుధవారం నుండి ఇసుక రీచులను నిరవధికంగా నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం వాయిదా వేశారు. అధికారులతో జరిగిన చర్చలతో సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఇసుక రీచుల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
పెండింగ్ బిల్లులు…
దాదాపు నాలుగేళ్లకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉన్నాయని బుధవారం నుండి నిరవధికంగా బంద్ పాటించాలని తెలంగాణ సాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. అయితే వీరితో టీజీఎండీసీ ఎండీ భ్రవేష్ మిశ్రా చర్చలు మంగళవారం చర్చలు జరిపారు. తమకు రావల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ఎండీని కోరగా కొంత సమయం ఇవ్వాలని పెండింగ్, రన్నింగ్ బిల్లులు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని ఎండీ వివరించారు. ఎండీ సూచన మేరకు తాత్కాలికంగా ఇసుక రీచుల బంద్ వాయిదా వేస్తున్నామని సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే రాష్ట్రంలోని వివిధ ఇసుక రీచులకు సంబంధించిన పెండింగు బిల్లులే సుమారు రూ. 560 కోట్ల వరకూ ఉన్నాయని దీంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాము పదే పదే వినతి చేస్తూ వచ్చామే తప్ప నిరసన వ్యక్తం చేయలేదని అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఇటీవల వరకు రన్నింగ్ బిల్లులు ఇచ్చినప్పటికీ వాటిని కూడా నిలిపివేశారని దీంతో రీచుల నిర్వహణ భారం తమపై అధికంగా పడుతోందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో అందించకపోవడంతో వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని దీనివల్ల తమపై మరింత ఆర్థిక భారం పడుతోందని కాంట్రాక్టర్లు వివరించారు.
మరో అభ్యర్థన…
అయితే తెలంగాణ సాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. బుధవారం మరోసారి టీజీఎండీసీ ఎండీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నెల 22 లోగా ఇసుక రీచుల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని లేనట్టయితే 23 నుండి రీచుల్లో ఇసుక సేకరించే కార్యకలాపాలను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నెల 22లోగా పెండింగ్, రన్నింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలని ఎండీకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టైంబాండ్ విషయంలో లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కూడా కోరనున్నట్టు సమాచారం.