విప్ జారీ చేయనున్న ఏఐఎఫ్బీ…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ బల్దియాలో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయ్. సోమవారం జరగనున్న సమావేశానికి ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపున కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండగా మరో వైపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో అంచనాలు తలకిందులు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మెజార్టీ స్థానాలు గెలిపించుకున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు నలుగురు కార్పొరేటర్లను తనకు అనుకూలంగా మల్చుకుంది. అయితే వీరిలో ఒకరు AIFB పార్టీ సింబల్ పై పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ ఉన్నారు. పార్టీ గుర్తుపై గెలిచి సైద్దాంతిక వైరుద్యం ఉన్న బీజేపీతో జట్టు కట్టడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన ఇద్దరు అభ్యర్థులకు విప్ జారీ చేసేందుకు AIFB నాయకులు సమాయత్తం అయ్యారు. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన ఇద్దరు కార్పొరేటర్లకు ఈ మేరకు సంకేతాలను కూడా పంపించినట్టుగా సమాచారం. వారు క్యాంపుల నుండి బయటకు రానట్టయితే విప్ జారీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో కార్పొరేషన్ లో బలబలాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సోమవారం జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విప్ ధిక్కరించినట్టయితే ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన ఇద్దరు కార్పొరేటర్ల సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండే ఈ వ్యవహారంపై AIFBకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టయితే ప్రతికూల ఫలితాలు చవి చూడాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. మరో వైపున ఇండియా కూటమిలో ఉన్న AIFB మద్దతును కూడగట్టుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నం అయింది. ఇదే సఫలం అయితే మాత్రం బీజేపీ అంచనాలు తారుమారవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ తరుపున టికెట్ ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేసిన పార్టీ నాయకత్వాన్ని కాదని తమ పార్టీ కార్పొరేటర్ క్యాంపునకు తరలి వెళ్లడం సరికాదని AIFB రాష్ట్ర నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ భారీ స్కెచ్…
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసినట్టుగా స్పష్టం అవుతోంది. బీజేపీ శిబిరంలోకి 34 మంది కార్పొరేటర్లు చేరుకున్న తరువాత మిగిలిన స్వతంత్రులను అక్కున చేర్చుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున గెలిచిన విపల సాయి జ్యోతికి విప్ జారీ చేసేందుకు AIFB నాయకత్వం సమాయత్తం కావడంతో తమకు అన్ని విధాలుగా లాభిస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కారణంగానే ముందుగా స్వతంత్రులు, ఇతర పార్టీ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించినట్టుగా అర్థం అవుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా ప్లాన్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన పంథం నెగ్గించుకునే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కరీంనగర్ బల్దియా వ్యవహారాల పరిశీలన బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో సమీకరణాలు నెరిపేందుకు కార్యరంగంలోకి దిగడం విశేషం.
వాదనలు ఇలా…
అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను వేరు చేసి తమకు మద్దతుగా మల్చుకున్నప్పుడు నైతికత ఏమైందన్న వాదనలను కాంగ్రెస్ నాయకులు తెరపైకి తీసుకవస్తున్నారు. పరిపూర్ణమైన మెజార్టీ రాకముందే కరీంనగర్ పై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ప్రకటించుకోవడం అనైతికత కాదా అని వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పార్టీ నాయకత్వం వ్యవహరిస్తోందని, కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 69 మంది ఉంటే బీజేపీ 30 స్థానాల్లో గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంటానని భావించడం సరైందేనా అని పొన్నం ప్రశ్రించారు. నిజామాబాద్ లో మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అక్కడి ఎంపీ ప్రకటించారన్నారు. ఏది ఏమైనా కరీంనగర్ కార్పొరేషన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఉత్కంఠత నెలకొంది.