బీజేపీకి రాజీనామా చేసిన భేతి మహేందర్ రెడ్డి
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ భారతీయ జనతాపార్టీకి సీనియర్ నాయకుడు రాజీనామా చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 24వ డివిజన్ నుండి జనసేన పార్టీ నుండి పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు.
తీవ్ర ఆవేదనతో…
కరీంనగర్ సీనియర్ బీజేపీ నాయకుడు, నగర మాజీ అధ్యక్షుడు భేతి మహేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకు తన రాజీనామా లేఖను పంపించారు. తీవ్ర ఆవేదనకు గురై, బాధతో రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో వెల్లడించారు. తాను 30 ఏళ్ల క్రితం నుండి ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్, బీజేవైఎం, బీజేపీ పార్టీలో వివిధ బాధ్యతల్లో పని చేశానని వివరించిన భేతి మహేందర్ రెడ్డి పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై, హైందవ ధర్మం కోసం దేశం కోసం అహర్నిశలు కష్టపడి పని చేశానని వివరించారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రశ్నించిన సందర్భంలో గత ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను పార్టీలోనే కొనసాగుతూ తనకు అవకాశం లభిస్తుందని ఆశించానన్నారు.
వారం క్రితం…
24వ డివిజన్ నుండి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశించి నామినేషన్ వేశానని, పార్టీతో సుదీర్ఘ కాలంగా అనుబంధంతో ఉన్న తనకు కాకుండా వారం రోజుల క్రితం పార్టీ ఫిరాయించి వచ్చిన వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని భేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో నిబద్దతతో నిజాయితీగా పని చేసే వారిని కాదని ఫిరాయింపుదారులకు, వారి ఆర్థిక స్థితిని చూసి బీఫామ్స్ ఇవ్వడం వల్ల తనతో పాటు ఇతర డివిజన్లలోని పార్టీ విధేయులకు కూడా అన్యాయం జరిగిందని భేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాణ సమానంగా భావించిన పార్టీని బాధతో వీడుతున్నానని భేతి మహేందర్ రెడ్డి ప్రకటించారు.