Telangana: ఆరోపణలు అక్కడ… అపాయింట్ మెంట్ ఇక్కడ…

దిశ దశ, కాళేశ్వరం:

దేవాదాయ శాఖలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అర్చకునిగా నియమించారు. ఇదే శాఖ పరిధిలోని ఓ ఆలయంలో హుండీ నిధులు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి ఏకంగా కాళేశ్వరం క్షేత్రంలో అర్చకునిగా నియమించడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ఆలయ అధికారుల దృష్టికి ఈ విషయం రావడంతో అతని నియమాక ప్రక్రియను పెండింగులో పెట్టారు.

నిర్మల్ జిల్లాలో…

నిర్మల్ జిల్లా సారంగపూర్ మహా పోచమ్మ ఆలయంలో హుండీ డబ్బులు దారి మళ్లించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి బాధ్యుడిగా పి కశ్యప్ శర్మగా తేల్చిన దేవాయ ఇన్స్ పెక్టర్ ఆడెల్లి, ఈఓ రవి కిషన్ గౌడ్ లు రీజనల్ జాయింట్ కమిషనర్ కు రిపోర్ట్ చేశారు. 2023లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఆలయంలో చండి పారాయణం చేసేందుకు  కాంట్రాక్టు ఉద్యోగిగా కశ్యప్ శర్మ పని చేస్తున్నప్పుడు ఈ ఆరోపణలు వచ్చాయి. తాజాగా కాళేశ్వరం దేవస్థానంలో అర్చక పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా కశ్యప్ శర్మ దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ దేవదాయ శాఖ కమిషనరేట్‌ లోని ధ్యాన మందిరంలో నిర్వహించిన రాత పరీక్షకు, మౌఖిక పరీక్షకు హాజరయ్యారు కశ్యప్ శర్మ. ఈ ఇంటర్వ్యూకు 40 మంది దరఖాస్తు చేసుకోగా 32 మంది హాజరు కాగా వారిలో ఐదుగురిని ఎంపిక చేసిన వారిలో కశ్యప్ శర్మ ఒకరు. త్వరలో వీరికి నియమాక పత్రాలను కూడా అందజేస్తామని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే కశ్యప్ శర్మ కాళేశ్వరం ఆలయంలో అర్చకునిగా ఎంపికయ్యాడన్న విషయం వెలుగులోకి రాగానే గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు, దేవాదాయ శాఖ అధికారుల బృందం పంపిన నివేదిక విషయం బయటకు వచ్చింది. దీంతో హుటాహుటిన కశ్మప్ శర్మ నియామకాన్ని తాత్కాలికంగా పెండింగులో పెడుతున్నామని, ఉన్నతాధికారుల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని ప్రకటించారు.

విచారణ చేయరా..?

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారి గురించి సమగ్రంగా ఆరా తీసే సాంప్రదాయం కొనసాగుతుంది. ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి సర్టిఫికెట్ల పరిశీలన, అతని నడక, నడవడిక, నేర చరిత్ర తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తుంటారు. ఒకవేళ చేసినట్టయితే అతనిపై వచ్చిన ఆరోపణలు తెలిసేవి. కానీ అర్చకుల నియామక ప్రక్రియ విషయంలో ఇలాంటి వివరాలు సేకరించారా లేదా అన్న చర్చ సాగుతోంది. కశ్యప్ శర్మ దేవాదాయ శాఖ పరిధిలోని మహా పోచమ్మ ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నప్పుడు వచ్చిన ఆరోపణల విషయం అతనికి ఎంపిక చేసినట్టుగా బయటకు తెలిసే వరకూ కూడా అధికార దృష్టికి రాకపోవడం గమనార్హం. ఈ కారణంగానే ఆయన రాత, మౌఖిక పరీక్షల్లో ఎంపిక కావడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్న వారూ లేకపోలేదు.

endomentsflash newskaleshwaramLatest Newstelangana news