కాటారంలో బాధితురాలి ఫిర్యాదు…
దిశ దశ, కాటారం:
బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేసి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని భ్రమలు కల్పించి… డిపాజిట్ దార్ల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన భవిత శ్రీ యాజమాన్యం వల్ల నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చిట్ ఏర్పాటు చేసి వాయిదా ప్రకారం డబ్బులు వసూలు చేసిన యాజమాన్యం బ్రాంచ్ కార్యాలయాలను తొలగించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో భవిత శ్రీ చిట్స్ పై మరో కేసు నమోదు అయింది. బాధితురాలు పెంట రజని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… నవంబర్ 2022 వరకు రూ. 5 లక్షల చిట్ లో సభ్యురాలిగా చేరి ప్రతి నెల డబ్బులు చెల్లించారు. డిసెంబర్ 2022న కాటారం బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లగా ఆఫీసు తొలగించారని తెలిసింది. దీంతో హన్మకొండ మెయిన్ బ్రాంచ్ ఆఫీసుకు వెళ్లగా అక్కడి సిబ్బంది రూ. 2.38లక్షల పైచిలుకు డబ్బులు వస్తాయని ఓ చీటిపై రాసి ఇచ్చారు. తనకు రావల్సిన చీటి డబ్బులు ఇవ్వాలని పలుమార్లు హన్మకొండ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ పని చేస్తున్న వారు వాయిదాలు వేస్తూ కాలయాపన చేశారని, చివరకు డబ్బులు ఇవ్వమని బెదిరించారని పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు కాటారం పోలీసులను ఆశ్రయించగా భవిత శ్రీ చిట్స్ ఛైర్మన్ గుండా ప్రకాష్ రావు, మేనేజింగ్ డైరక్టర్ తాటిపల్లి శ్రీనివాస్, ఈడీ నాగరాజులపై కేసు నమోదు చేశారు.
అదెలా సాధ్యం..?
అయితే చిట్ ఫండ్ లిమిటెడ్ కంపెనీగా అనుమతులు తీసుకున్న తరువాత బ్రాంచ్ ఆఫీసులను ఎక్కడైనా తెరిచే అవకాశం ఉంటుంది. అయితే సదరు బ్రాంచ్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన చిట్స్ లో చేరిన సభ్యుల వివరాలు, చిట్ విలువ తదితర సమగ్ర వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. బ్రాంచ్ కార్యాలయాన్ని తొలగించాలని యాజమాన్యం భావించినప్పుడు చిట్ సభ్యులకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించినట్టుగా ఆధారాలను, రికార్డులను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించిన తరువాతే బ్రాంచ్ ఆఫీసును తొలగించేందుకు అనుమతి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాటారం బ్రాంచ్ కార్యాలయాన్ని తొలగించిన తరువాత కూడా బాధితులు వెలుగులోకి వస్తున్నారంటే అసలేం జరిగి ఉంటుందో అర్థం కాకుండా పోయింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతులు తీసుకున్న చిట్ క్లోజ్ అయినట్టుగా వివరాలు సమర్పించిన తరువాతే బ్రాంచ్ ఎత్తేశారా లేక సదరు కార్యాలయ అధికారులను తప్పు దారి పట్టించారా అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక వేళ చిట్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందించిన రికార్డుల ప్రకారమే సంస్థ నడుచుకున్నట్టయితే తమకు అన్యాయం జరిగిందని బాధితులు తెరపైకి ఎలా వస్తున్నారన్నదే అంతు చిక్కకుండా పోతున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులకు సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిందా లేక అనుమతి తీసుకోకుండానే మరిన్ని చిట్స్ నడిపించిందా అన్న విషయంపై కూడా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. కాటారం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు రజని ఇచ్చిన ఫిర్యాదును గమనించినట్టయితే 2022 నవంబర్ లో ముగిసిన రూ. 5 లక్షల చిట్ కు సంబంధించిన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగేందుకు అదే సంవత్సరం డిసెంబర్ నెలలో కాటారం వెళ్లగా అప్పటికే బ్రాంచ్ ఆఫీసును తీసేశారని పేర్కొన్నారు. ఈ లెక్కన చిట్ సభ్యులకు డబ్బులు ఇవ్వక ముందే బ్రాంచ్ ఆఫీసును తరలించి ఉంటారని స్పష్టం అవుతోంది. లేనట్టయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతులు తీసుకున్న చిట్స్ తో కాకుండా మరిన్ని చిట్స్ నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతులు తీసుకోకుండానే చిట్స్ నిర్వహించినట్టయితే సదరు సంస్థపై డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే రజని హన్మకొండలోని మెయిన్ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆమెకు రూ. 2.38 లక్షల పై చిలుకు డబ్బులు మాత్రమే వస్తాయని రాసిచ్చారని వివరించారు. వాస్తవంగా చిట్స్ రిజిస్ట్రేషన్ విభాగం నిబంధనల ప్రకారం ఎంత మేర డబ్బులు కట్ చేయాల్సి ఉంటుంది..? ఇందుకు అనుగుణంగానే చిట్స్ కంపెనీ ప్రతినిధులు నడుచుకున్నారా లేదా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిట్ సంస్థలు సామాన్యులను నిట్ట నిలవునా దగా చేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.