జగిత్యాల పంచాయితీ సద్దుమణిగినట్టేనా..?
దిశ దశ, జగిత్యాల:
కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిన జగిత్యాల వ్యవహారం కొలిక్కివచ్చినట్టేనా..? అభ్యర్థుల ఎంపిక విషయంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనకు ఆ ఇద్దరు నేతలు సై అంటారా..? సోమవారం రాత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై స్థానికంగా చర్చ సాగుతోంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విషయం చిలికి చిలికి గాలి వానాలా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోకి డాక్టర్ సంజయ్ ను చేర్పించుకోవడంపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ విధేయులకే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశాన్ని కూడా బహిష్కరించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు సంజయ్ కుమార్ కూడా కౌంటర్ అటాక్ కు దిగి జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న క్రమంలోనే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జగిత్యాలలో పర్యటించి అదిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవల్సిందేనని పరోక్షంగా జీవన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి జీవన్ రెడ్డి దూరంగా ఉండగా డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఆ తరువాత కొంత సైలెన్స్ నెలకొనడంతో అసలేం జరగనుందన్న ఆసక్తి స్థానికంగా వ్యక్తం అయింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అదిష్టానం నుండి సరికొత్త ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డికి 20 బీఫారాలు, డాక్టర్ సంజయ్ కుమార్ కు 30 బిపారాలు ఇవ్వాలన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇద్దరు నేతలు ఎలా స్పందిస్తారోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది. జగిత్యాలలోని 50 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్న జీవన్ రెడ్డి 20 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అదిష్టానం చేసిన ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారోనన్న చర్చ సాగుతోంది. అలాగే డాక్టర్ సంజయ్ కూడా తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకునే విషయంలో వెనుకడుగు వేయరన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదిష్టానం కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనపై జగిత్యాల నాయకుల నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.