దిశ దశ, హైదరాబాద్:
మీడియా రంగంలో అక్రిడిటేషన్ అనేది ఓ బ్రహ్మ పదార్థంలా మారిపోయింది.ఇది కొన్ని సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టుల పాలిట శాపంగా మారితే… సంస్థలకు మాత్రం అమృతం అందించే అక్షయ పాత్రగా తయారైంది. దీంతో సాధారణ జర్నలిస్టు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదనే చెప్పాలి.
టార్గెట్ ఫిక్స్…
తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో ఇదే అదనుగా భావించిన కొన్ని సంస్థలు ఈ సౌలభ్యాన్ని ఆదాయన్నిచ్చే కల్పతరువుగా మార్చుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంస్థలు ఇచ్చే జాబితాను అనుసరించి మాత్రమే కార్డులు జారీ చేయడం ఇందుకు ప్రధాన కారణం. స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ మొదలైందంటే చాలు జర్నలిస్టుల గుండెలు గుభేల్ మంటున్నాయి. తమ సంస్థలు యాడ్స్ టార్గెట్ ఎంత ఫిక్స్ చేస్తాయోనన్న ఆందోళనతో వారు కొట్టుమిట్టాడుతుంటే సమావేశాల పేరిట క్షేత్ర స్థాయి నుండి జిల్లా స్థాయి జర్నలిస్టులకు వారి వారి కార్యాలయాల నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. అక్రిడేషన్ జాబితాలో మీ పేరు ఉండాలంటే యాడ్ రెవెన్యూ ఇంత మొత్తంలో చెల్లించాల్సిందేనని యాజమాన్యాల స్పష్టం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని సంస్థలు అయితే ఇంతకు ముందే ఐఅండ్ పీఆర్ జాబితాలో తమ పత్రిక పేరు ఫలానా విభాగంలో వచ్చిందని అందరికీ అక్రిడేషన్లు ఇవ్వడమే తరువాయని చెప్పి సమగ్ర వివరాలు కూడా తెప్పించుకుని, రెవెన్యూ టార్గెట్ ఫిక్స్ చేసి వసూలు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రిడిటేషన్ దరఖాస్తులు ప్రక్రియ మొదలు కావడంతో మళ్లీ టార్గెట్లు ఇస్తున్నారన్న ఆవేదన సగటు జర్నలిస్టులో వ్యక్తం అవుతోంది. అక్రిడేషన్ల పేరిట సంస్థ బ్యాలెన్స్ పెంచేందుకు తామిప్పుడు ఎవరి కాళ్లావేళ్లా పడాలో తెలంగాణలోని జర్నలిస్టులకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.
‘‘RMD’’లుగా..!
ఒకప్పుడు కేవలం వార్తా సేకరణకే పరిమితమైన జర్నలిస్టులు ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాల్సిన దుస్థితి ఏర్పడింది. తాము ఇప్పుడు రిపోర్టింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ‘‘RMD’’లుగా మారాల్సిన పరిస్థితి దాపురించిందన్న మనోవేదనకు జర్నలిస్టులు గురవుతున్నారు. ప్రింట్ మీడియాలో అయితే సర్క్యూలేషన్ డిపాజిట్లు, యాడ్స్, సంవత్సర చందాలు, పేపర్ పంపిణీ వంటి వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యత కూడా జర్నలిస్టులు తమ భుజాలపై వేసుకోవాల్సి వస్తోంది.
రివ్యూ మీటింగ్…
అయితే కొన్ని సంస్థలు ఇదే అదనుగా భావించి రెవెన్యూ పెంచుకునే పనిలో నిమగ్నం కాగా శుక్రవారం నాటి రివ్యూ సమావేశంలో జరిగిన చర్చకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తే ఖంగుతినక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రిడేషన్ల ముసుగులో సంస్థలు రెవెన్యూపై దృష్టి సారిస్తే అంతర్గత సమావేశంలో జరిగిన చర్చ,
జిల్లా స్థాయిలోని అధికారులకు
సూచించిన ఆదేశాల విషయం చూస్తే అక్రిడేషన్ల కోత తప్పేలా లేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రింట్ మీడియాకు అయితే ABC, PRGI, CA గణాంకాల ఆధారంగానే అక్రిడేషన్లు జారీ చేయాలని, ఎలక్ట్రానిక్ మీడియా అయితే రేటింగ్స్ ఆధారంగా టాప్ టెన్ వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి తప్ప ఇష్టారీతిన మంజూరు చేయకూడదన్న సంకేతాలు ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే ఇఫ్పుడు కొన్ని సంస్థలు తమకు అక్రిడేషన్లు వస్తాయన్న బూచి చూపించి రెవెన్యూ వసూలు చేస్తున్నా సదరు జర్నలిస్టులకు మాత్రం కార్డులు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఐ అండ్ పీఆర్ విభాగం నుండి జాబితా విడుదలైందని తమ సంస్థకు ప్రతి మండలానికి అక్రిడేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నా అనుకున్న మేర కార్డులు జారీ అయ్యే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.