దిశ దశ, మంచిర్యాల:
చనిపోయిన కార్మికునికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం విషయంలోనూ లేబర్ ఆఫీసర్ కక్కుర్తి పడుతున్నారు. కూలీ నాలీ చేసుకుని జీవించే అభాగ్యుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంలోనూ డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఏసీబీ అధికారులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాటం రామ్ మోహన్ సిర్పుర్ కాగజ్ నగర్ ఫుల్ అడిషనల్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రిజిస్టర్డ్ కార్మికుడు ఒకరు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో లేబర్ విభాగం ద్వారా దహన సంస్కారాలకు సాయం అందించడంతో పాటు కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ. 50 వేలు ఇస్తేనే ఇందుకు సంబంధించిన ఫ్రతిపాదనలు పంపిస్తానని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాటం రాంమోహన్ తేల్చి చెప్పారు. దీంతో మృతుని సోదరుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం రూ. 50 వేలు తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లో కూడా నిందితుని చేతికి సంబంధించిన ఆధారాలు లభ్యం అయ్యాయి. అతన్ని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. .
రూ. 1.30 లక్షల కోసం… 30 వేలు డిమాండ్…
మరోవైపున బెల్లంపల్లిలోనూ ఏసీబీ దాడులు జరిగాయి. సాధారణ మరణం చెందిన ఓ కార్మికునికి ప్రభుత్వం తరుపున రావల్సిన రూ. 1.30 లక్షల ఆర్థిక సాయం అందించే విషయంలో రూ. 40 వేలు ఇవ్వాలని బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య డిమాండ్ చేశారు. చివరకు రూ. 30 వేలు ఇస్తే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం రూ. 30 వేలు పట్టుకుంటుండగా రెడ్ హైండెడ్ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య తన అసిస్టెంట్ రాజేశ్వరి ద్వారా లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని కూడా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
డిప్యూటీ తహసీల్దార్…
సిద్దిపేట జిల్లా ములుగు డిప్యూటీ తహసీల్దార్ యెలగందుల భవాని రూ. 2 లక్షలు డిమాండ్వ చేసి నందుకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వ్యవసాయ భూమికి సంబంధించిన పాసు పుస్తకం ఇచ్చేందుకు అవసరమైన ప్రాసెస్ చేసేందుకు ఆమె ఈ డబ్బులు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు.
పాల్వంచలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మునిసిపాలిటీలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 40, 765 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.