దిశ దశ, హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ గా పని చేసిన మరో అధికారిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఏక కాలంలో పది చోట్ల సోదాలకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ENC)గా పని చేసిన మురళీధర్ రావుపై తెలంగాణ ACB ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం నుంచి మురళీధర్ రావుకు చెందిన మూడు ఇండ్లతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుకు చెందిన హైదరాబాద్ బంజారాహిల్స్ ఇంటితోపాటు కరీంనగర్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రాథమికంగా అక్రమంగా సంపాదించిన ఆదాయానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ సేకరించినట్టుగా తెలుస్తోంది. స్థిరాస్తులతో పాటు, బంగారం, నగదును గుర్తించినట్లు సమాచారం. ఇంకా సోదాలు కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు లెక్కలు తేలోన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
విజిలెన్స్ జాబితాలో…
తాజాగా మంగళవారం తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన ఈఎన్సీ మురళీధర్ రావు పేరు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికలో కూడా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికలో మురళీధర్ రావుపై క్రిమినల్ చర్యలతో పాటు, పెన్షన్ నుండి కూడా రికవరీ చేయాలని సూచించింది.