karimnagar: కరీంనగర్ బల్దియాలో అసలేం జరుగుతోంది..? డిజాస్టర్ విభాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారా..?

ఓ మహిళ వీడియో వైరల్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పోరేషన్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుట్ పాత్ ఆక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సినప్పటికీ కొందరినే టార్గెట్ చేయడానికి కారణమేంటీ..? డిజాస్టర్ వింగ్ లక్ష్యం దారి తప్పుతోందా..? కరీంనగర్ భగత్ నగర్ లో అవకాయ్ టిఫిన్స్ అండ్ క్యాటరర్స్ నిర్వహకురలు ఫణిత మునిపల్లి తన ఆవేదనను వెల్లగక్కుతూ విడుదల చేసిన వీడియో కరీంనగర్ లో వైరల్ అవుతోంది. దీంతో మునిసిపాలిటీ యంత్రాంగం వ్యవహరిస్తున్న వివక్ష తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టార్గెట్ చేశారంటూ…

ఫణిత మునిపల్లి విడుదల చేసిన వీడియోలో తననే టార్గెట్ చేశారని, తనతో పాటు మరో 30 మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నానన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా నిబంధనల బూచి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భగత్ నగర్ లో తాను ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ ఫుట్ పాత్ ను ఆక్రమించానని ఫిర్యాదులు వచ్చాయని డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం యంత్రాంగం వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తోట రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము వచ్చామని డిజాస్టర్ వింగ్ సిబ్బంది చెప్పారని ఫణిత మునిపల్లి వివరించారు. తాను కేవలం దోశ బట్టిని ఫుట్ పాత్ కు చెందిన కొంతమేర స్థలాన్ని మాత్రమే వినియోగించుకున్నానని, అయితే సమీపంలోని మిగతా టిఫిన్ సెంటర్లయితే ఫుట్ పాత్ మొత్తాన్ని ఆక్రమించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేవల తన టిఫిన్ సెంటర్ ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న తీరు ఎంత వరకు సమంజసమని ప్రశ్నిచారు. అయితే నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆక్రమించుకుని వ్యాపారం చేసుకుంటున్న ఫోటోలను తనకు పంపించాలని పిలుపునిచ్చారు. ఫణిత మునిపల్లి విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో కరీంనగర్ మునిసిపాలిటీలో అసలేం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది.

డిజాస్టర్ వింగా…?

విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలందించేందుకు కార్పోరేషన్ లో ఏర్పాటు చేసిన డిజాస్టర్ వింగ్ వాహనాలు మునిసిపల్ స్థలాల ఆక్రమణల విషయంలో వినియోగించడానికి కారణమేంటన్నదే పజిల్ గా మారింది. టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో ఉండే ఈ విషయంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం సేవలు ఉపయోగించుకుంటుండడం వెనక ఆంతర్యం ఏంటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధం లేని విభాగం యంత్రాంగాన్ని వినియోగిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆక్రమణలో విషయంలో అందరి పట్ల ఒకే రీతిలో నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు చెప్పిన వెంటనే టార్గెట్ చేసిన చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ బల్దియాలో జరుగుతున్న ఈ తప్పటడుగుల విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మునిపల్లి ఫణిత ఆవేదనకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి…

You cannot copy content of this page