యాజమాన్యం నిర్లక్ష్యం తేలితే చర్యలు: సీపీ గౌష్ ఆలం
దిశ దశ, కరీంనగర్:
శ్రీ దీపిక హస్పిటల్ లో జ్వరంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న పేషెంట్ పట్ల అఘాయిత్యానికి ఒడిగడ్డిన కేసులో నిందితున్ని అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మీడియాకు తెలిపారు. ఈ నెల 6న జ్వరంతో బాధ పడుతున్న యువతిని సదరు ఆసుపత్రిలో జాయిన్ చేయగా ఇదే ఆసుపత్రిలో కంపౌండర్ (ఓటీ టెక్నీషియన్)గా పని చేస్తున్న పెద్ది దక్షిణ్ మూర్తి అలియాస్ దక్షిణా మూర్తి (23) బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేశామన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా లక్ష్మీదేవిపేటకు చెందిన నిందితుడు కొంతకాలంగా కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేశాడని సీపీ వివరించారు. ఇంటర్మీడియెట్ చదువుకున్న దక్షిణా మూర్తి నాలుగేళ్ల క్రితం కరీంనగర్ ఆర్కిడ్ ఆషుపత్రిలో వార్డ్ బాయిగా పని చేసి, ఆ తరువాత హరిణీ ఆసుపత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా పని చేశాడన్నారు. తరుచూ మద్యం సేవిస్తూ డ్యూటీకి వస్తున్నాడన్న కారణంతో ఆసుపత్రి యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుండి తొలగించిన తరువాత స్వగ్రామానికి వెళ్లిపోయాడని, తిరిగి వచ్చిన తరువాత శ్రీ దీపికా ఆసుపత్రిలో కంపౌండర్ గా పని చేస్తున్నాడని తెలిపారు. నిందితుడు అశ్లీల వెబ్ సైట్లు చూస్తూ, మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడని చెప్పారు. దక్షిణా మూర్తిపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 343/2025, సెక్షన్ 64(2)(e) BNS, 2023 కింద కేసు నమోదు చేశామని, అతన్ని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తున్నామని సీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో హస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలితే ఉన్నతాధికారులకు నివేదికలు పంపి చర్యలు తీసుకుంటామన్నారు.

