Singareni: మిలిటెంట్ పోరాటాలకు సిద్దం కండి… సికాస పిలుపు…

దిశ దశ, రామగుండం:

సింగరేణి కార్మికుల హక్కులను సాధించుకునేందుకు మిలిటెంట్ పోరాటాలకు సమాయత్తం కావాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. కోల్ బెల్ట్ కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో… ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు దళారీ దొంగనాటకాలను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రెండు సంఘాల నాయకులు మరో రెండేళ్లు కార్మికులను ద్రోహం చేసేందుకు మెమోరాండాలు, పోరాటాలు మొదలు పెట్టారని ఆశోక్ ఆరోపించారు. కోల్ బెల్ట్ ఏరియా ఎంపీలు లోకసభలో సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మాట్లాడడం లేదని, దీంతో పాటు కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత పోరాటాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అనారోగ్యంతో అండర్ గ్రౌండ్ కార్మికులు అన్ ఫిట్ అయితే వారికి అనువుగా ఉండే చోట డ్యూటీలు వేయాలని, మెరుగైన ఎడ్యూకేషన్ పాలసీ, వైద్యం సౌకర్యాల జోలికి వెళ్లకుండా, కొత్త బొగ్గు గనుల ద్వారా సంస్థను పరిరక్షించుకోవడం, మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని సికాస కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. జులై 30, 31 తేదీలలో జరిగిన రీ మెడికల్ చెకప్ వచ్చిన ప్రతి ఒక్కరిని అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా అశోక్ దుయ్యబట్టారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకవచ్చే ఆలోచనను పక్కనపెట్టి, యాజమాన్యం, పాలకులు పరోక్షంగా సంస్థకు నష్టం కల్గించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడి దారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలకు రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన సహకరిస్తోందని సికాస కార్యదర్శి విమర్శించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నికలప్పుడు శుష్క వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో అత్యధిక స్థానాలను గెలుచుకుందని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని అశోక్ ఆరోపించారు.