దిశ దశ, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరో అవినీతి రెవెన్యూ ఉద్యోగులపై ఏసీబీ కొరడా ఝులిపించింది. భూమి సర్వే విషయంలో భారీగా డబ్బులు డిమాండ్ చేసిన సర్వేయర్, చైన్ మెన్ లపై అవినీతికి పాల్పడిన కేసులు నమోదు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు చేసి సర్వేయర్ మంజుల, చైన్ మెన్ లను అరెస్ట్ చేశారు.
ఫోన్ పే ద్వారా లంచం…
ఓ భూమికి సంబంధించిన సర్వే చేసేందుకు రూ. లక్ష డిమాండ్ చేసిన సర్వేయర్ మంజుల, చైన్ మెన్ లు లంచం కోసం వేధిస్తున్న తీరుపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఓ సారి రూ. 26.500 నగదు తీసుకోగా, రూ. 16, 500 ఫోన్ పే ద్వారా డబ్బులు తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. ఇవి కాకుండా రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సర్వేయర్ మంజుల, చైన్ మెన్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

