అంజన్న ఆలయంలో వింత సాంప్రాదాయం…

కొండగట్టు ఆలయ అధికారుల తీరుపై చర్చ…

దిశ దశ, జగిత్యాల:

సామాన్య భక్తులు, వికలాంగులు ఎవరైనా సరే… ఆలయ సమీపంలోకి వాహనాలకు ఎంట్రీ లేదని దేవాదాయ అధికారులు ప్రకటించారు. వీఐపీల వాహానలను సైతం ఆలయ ప్రాంగణంలోకి  అనుమతించేది లేదని కుండ బద్దలు కొట్టారు. దీంతో సామాన్య భక్తులు  కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు కాలి నడకన వెలుతున్నారు.  అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈ నిబంధనలు దేవాదాయ శాఖ అధికారులకు గుర్తుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నిబంధన ఇలా…

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకునే సాధారణ భక్తులే అయినా, వీఐపీలే అయినా ఖచ్చితంగా నడిచి రావల్సిందేనని…  ఆలయ ప్రాంగణంలోకి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఆలయ అధికారులు. కొన్ని నెలలుగా అంజన్న ఆలయ అధికారులు  ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ప్రముఖుల విషయంలో మినహాయింపు ఉంటుందని భావించారంతా. కానీ తెలంగాణకు చెందిన ప్రముఖులు ఎవరు వచ్చినా అంజన్న ఆలయానికి వెల్లే మార్గంలోని చెక్ పోస్ట్ వద్ద ఉన్న పార్కింగ్ ప్లేస్ వద్దో లేక టెంకాయల దుకాణం వద్దో వాహనానలు నిలిపివేసి కాలినడకన ఆలయం వద్దకు చేరుకోవాలని కుండబద్దలు కొడుతున్నారు. వికలాంగులు, వృద్దులు అయినా సరే వాహనాలను ప్రధాన ఆలయం వద్దకు అనుమతించేది లేదని తేల్చి చెప్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా చెక్ పోస్ట్ పార్కింగ్ ప్లేస్ నుండి అంజన్న సన్నిధికి నడుచుకుంటూ వెలుతున్నారు.

వీఐపీలైనా…

అంజన్న సన్నిధికి వచ్చే ప్రముఖులకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్థానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లినప్పుడు కూడా ఆలయ అధికారులు ఆయన వాహనాన్ని అనుమతించలేదు. ఎమ్మెల్యేకు, ఆలయ అధికారులకు మధ్య ఈ విషయంలో రభస జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవల జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లినప్పుడు కూడా ఆయన కాన్వాయ్ టెంకాయల దుకాణం వరకు మాత్రమే వెల్లింది. అక్కడి నుండి మంత్రి అడ్లూరి ఆలయం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు.

పవన్ విషయంలో…

అయితే కొండగట్టు అంజన్న సన్నిధితో రూ. 35 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం. JNTU వరకు హెలిక్యాప్టర్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నేరుగా అంజన్న క్షేత్రానికి చేరుకున్నారు. పవన్ ప్రయాణించిన కాన్వాయ్ లోని వాహనాలు అంజన్న ఆలయ రాజగోపురం వరకు చేరుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ తో పాటు ఇతరుల వాహనాలకే కూడా ఈ ప్రాంతానికి అనుమతించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పోలీసులు కూడా అక్కడే గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో అంజన్న ఆలయంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పిన దేవాదాయ శాఖ అధికారులు ఏపీ డిప్యూటీ సీఎం టూర్ విషయంలో మినహాయింపు ఇవ్వడంపై స్థానికంగా చర్చ సాగుతోంది.