మల్టీపర్పస్ సొసైటీకి విస్తృత ప్రచారం ఎందుకు..?

దిశ దశ, జాతీయం:

‘‘PODSA TOMORROW OPENING ’’ అంటూ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? ఒక్క సొసైటీ నిర్వాహకులే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వాట్సప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేస్తున్నారు…? సరిహధ్దుల్లోని ఆ మల్టీ పర్పస్ సొసైటీ విషయంలో ఈ స్థాయిలో క్యాంపెయిన్ ఎందుకు నడుస్తోంది..? ఇప్పుడివే ప్రశ్నలు అన్ని వర్గాలను వెంటాడుతున్నాయి.

సొసైటీ మాటున…

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా తాలుకా దాబా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దుల్లో పోడ్సా వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ సమాధాన్ మల్టీ పర్పస్ సొసైటీలో అసలేం జరుగుతోంది..? నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులు నడుచుకుంటున్నారా..? స్థానికేతరులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చేందుకు అనుమతులు ఉన్నాయా..? అన్న విషయాలపై చంద్రపూర్ జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మల్టీ పర్పస్ సొసైటీలో తెలంగాణకు చెందిన వారే భారీ సంఖ్యలో ఎందుకు ఉంటున్నారు..? ఆ సొసైటీలో నిర్వహకులు, ఉద్యోగులు తప్ప మిగతా వారంతా తెలుగు వారే ఉండడానికి కారణం ఏంటీ..? అన్న కోణంలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని రాత్రి 9.30 గంటల్లోగా సొసైటీని మూసి వేస్తున్నామని చెప్తున్న నిర్వాహాకులు గేమింగ్ నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం ఎన్ని టేబుళ్లకు అనుమతి ఇచ్చింది..? వాస్తవంగా అక్కడ ఎన్ని టేబుళ్లు కొనసాగుతున్నాయన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మల్టీ పర్పస్ సొసైటీలో ఒక్క పేకాట మాత్రమే ఆడాలన్న నిబంధన ఉందా..? ఇతర గేమ్స్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదా అన్న వివరాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సువిశాలమైన మహారాష్ట్రలో కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనే ఈ మల్టీ పర్పస్ సొసైటీలు ఏర్పాటు చేయడం వెనక ఎన్న ఆంతర్యం ఏంటీ అన్న విషయంపై కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాయిన్స్… క్యాష్…

ఇకపోతే ఇక్కడ నిబంధనల ప్రకారం నేరుగా ఆర్థిక లావాదేవీలు జరపకుండా కాయిన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని టేబుళ్లలో కూర్చునే వారికి మాత్రమే కాయిన్స్ అందించే విధానం అమలు చేస్తుండగా మరికొన్ని టేబుళ్లపై కూర్చుంటున్న ప్లేయర్స్ నుండి డైరెక్ట్ క్యాష్ కలెక్షన్ చేస్తున్నట్టుగా సమాచారం. అధికారికంగా అనుమతి తీసుకున్న టేబుళ్లకు మాత్రం కాయిన్స్ ఇస్తూ మిగతా టేబుళ్ల నుండి నేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సరిహద్దులు దాటి…

ఉత్తర తెలంగాణలోని సరిహధ్దు జిల్లాలకు చెందిన వారు పెద్డ సంఖ్యలో పోడ్సా సొసైటీకి చేరుకుంటున్నారు. అసలు వీరంతా అక్కడకు చేరుకోవడానికి కారణం ఏంటీ..? సొసైటీ సభ్యులకు వీరికి ఉన్న సంబంధాలు ఏమిటీ..? కేవలం పేకాట మాత్రమే నిర్వహించడం వల్ల జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు ఎన్ని కోట్లలో సాగుతున్నాయి..? తదితర అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే విస్తూపోయే నిజాలు బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క పోడ్సా కేంద్రంగానే రూ. కోట్లలో టర్నోవర్ సాగుతుండగా లక్షల్లో కమిషన్లు చేతులు మారుతున్నాయంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.