దిశ దశ, కరీంనగర్:
శ్రీరాంసాగర్ కెనాల్ రోడ్డును ప్రధాన రహదారిగా చూపించుకుని వెంచర్ సిద్దం చేయడంపై ఇరిగేషన్ అధికారులు అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు సుడా వైస్ ఛైర్మన్ కు కూడా లేఖ రాసినప్పటికీ అనుమతులు మాత్రం రద్దు కానట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ వెంచర్ లో ప్లాట్ల నిర్మాణం మొదలుపెట్టినట్టుగాస స్పష్టం అవుతోంది.
ఈఈ లేఖ
ఇరిగేషన్ 5వ డివిజన్ ఈఈ పి నాగభూషణ్ రావు 2021 సెప్టెంబర్ 22న జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. Lr.No. EE/Irr.Divn.5/IC.2/TS/T2/M/706 లేఖ ద్వారా అభ్యంతరాలు తెలపడంతో పాటు అక్షర టౌన్ షిప్ పేరిట ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరారు. సర్వే నెంబర్: 745, 777, 778, 782, 783, 784, 854లలోని 28.13 ఎకరాల భూమిలో లే ఔట్ అనుమతులు తీసుకున్నారని, ఈ భూమి DP-17 కి.మీ. 5.445, D93కెనాల్ సమీపంలో లేఔట్ అనుమతులు తీసుకున్నారని దానిని రద్దు చేయాలని కోరారు. అక్షర టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ Lr.ROC.NO. 3145/Nagunur/2021/0167 తేది 2021 ఆగస్టు 11న ద్వారా శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (SUDA) అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. అక్షర డెవలపర్స్ భూమిని చదును చేస్తున్న క్రమంలో పీల్డ్ ఛానెల్స్ తో కూడి 2 డ్రాప్స్ ధ్వంసం చేశారని దీనివల్ల దిగువన ఉన్న 35 ఎకరాల భూమికి సాగు నీరందించే పరిస్థితి లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ వెంచర్ అనుమతుల విషయంలో జిల్లా కలెక్టరో చొరవ తీసుకుని సుడా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఇరిగేషన్ విభాగం అదికారులు నోఆబ్జక్లసన్ సర్టిఫికెట్ (NOC) ఇస్తే తప్ప అక్షర టౌన్ షిప్ లో పనులు జరకుండా చూడాలని కోరారు. ఈ లేఖ ప్రతులను కరీంనగర్ మునిసిపల్ కమిషనర్, సుడా వైస్ ఛైర్మన్, కరీంనగర్ పోలీసు కమిషనర్, కరీంనగర్ తహసీల్దార్ లకు పంపించారు.
చకా చకా…
కరీంనగర్ సుడా ఇచ్చిన ఈ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఇరిగేషన్ అదికారులు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్టుగా స్పష్టం అవుతోంది. తాజాగా అక్షర టౌన్ షిప్ నిర్వాహాకులు నగునూరులోని ఈ వెంచర్ లో అభివృద్ది పనులు చేపడుతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2021 నుండి ఇప్పటి వరకు దానిని హోల్డ్ లో ఉంచి తాజాగా ఈ వెంచర్ లో ఇంటర్నల్ రోడ్లు వేస్తుండడం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన లేఖ విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్, సుడా, వివిధ విభాగాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్నది మాత్రం బయటకు పొక్కడం లేదు. ఎస్సారెస్పీ కెనాల్ తో పాటు ఫీల్డ్ చానెల్స్ కూడా ధ్వంసం అయ్యాయని ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం నడుచుకోకపోవడం వెనక ఉన్న కారణమేంటన్నది అంతుచిక్కకుండా పోయింది.
నిర్లక్ష్యమెవరిది..?
ఇరిగేషన్ అధికారులు గతంలో స్థానిక పోలీసు స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినప్పటీ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అయ్యాయని కేసు నమోదు చేయనట్టుగా సమాచారం. ధ్వంసం అయిన ఫీల్డ్ ఛానెల్స్ పునరుద్దరిస్తామని నిర్వాహకులు చెప్పడంతో సరిపెట్టుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపున ఇరిగేషన్ అధికారులు అప్పుడు లేఖలు రాశారు తప్ప లేఔట్ అనుమతులు రద్దు చేసే వరకూ దృష్టి సారించనట్టుగా సమాచారం. తాజాగా నగునూరు అక్షర టౌన్ షిప్ లో ప్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. 2021లోనే వెంచర్ విషయంలో ఇరిగేషన్ అధికారులు లేఖలు రాసినా స్పందనలేకుండా పోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

