సరస్వతి నదికి పుష్కరాలు… చరిత్ర లోతులను పరిశీలిస్తే..?

దిశ దశ, కాళేశ్వరం:

సింధూ, నర్మద, యమున, సరస్వతి, కావేరి, ప్రాణహిత, భీమ, తుంగభద్ర, పుష్కర, గోదావరి, కృష్ణ, తామ్రపర్ణి ఈ నదులకు పుష్కరాలు జరిపే సాంప్రాదాయం యుగయుగాలుగా కొనసాగుతోంది. పంచ భూతాలలో ఒకటైన నీటిని ఆరాధించే సంస్కృతి పూర్వీకుల నుండి అందిపుచ్చుకున్న  విధానమే. ఇందులో భాగంగానే ఏటా ఒక నది చొప్పున పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. దేశంలోని 12 నదులకు మాత్రమే ఈ పుష్కరాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. మే 15 నుండి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే కాలగర్భంలో కలిసిపోయిన ఈ సరస్వతి నది చరిత్ర లోతులు పరిశీలిస్తే…

హిమాలయాల్లో పుట్టి…

పాకిస్తాన్, భారత్ లో దాదాపు 5 వేల ఏళ్ల క్రితం సరస్వతి నది ఉనికి ఉండేది. 4 నుండి 5 వేల కిలోమీటర్ల మేర ఉన్న ఈ నది భారతదేశంలో వాయువ్య దిశలో ప్రవహించేదని చరిత్ర చెబుతోంది. భూమిలో వచ్చిన మార్పుల కారణంగా అంతర్థానం అయిపోయిన సరస్వతి నది ఉనికి ఇటీవల పరిశోధకుల శోధనలో కూడా వెలుగులోకి వచ్చింది. పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావించిన సరస్వతి నది భూమిపై ప్రవహించేదని, ఋగ్వేదం కాలంలోనూ ఈ నది ఉనికి ఉందని చరిత్ర చెబుతోంది. సరస్వతి నది ఉండేదా లేదా అన్న తర్జనభర్జనలు పెద్ద ఎత్తున సాగాయి. ఈ క్రమంలో ఈ నది ఉనికి వాస్తవమేనా కాదా అన్న విషయంపై పరిశోధనలు జరిపిన వారూ ఉన్నారు. ‘‘ది లాస్ట్ రివర్’’ అనే పుస్తకాన్ని రిసెర్చర్ మిచెల్డ్ డానిడో రచించాడు. ఫ్రాన్స్ కు చెందిన ఈయన ఎక్కువ కాలం భారతదేశంలోనే నివసించాడని చరిత్రకారులు చెప్తున్నారు. సింధూ నాగరికత కాలంలో జీవనాడిగా సరస్వతి నది ఉండేదని, కొంతకాలం తరువాత ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని వెల్లడించారు. యమునా నదిని తాకుతూ చివరికి గంగా నదిలో కలిసిపోయిందని కూడా అందులో పేర్కొన్నారు. 2016లో ప్రభుత్వం వేసిన ఓ కమిటీ కూడా ఒకప్పుడు సరస్వతి నది ఉండేదని తేల్చేసింది. 2018లో కూడా ఇస్రో శాటిలైట్‌ చిత్రాలు సరస్వతీ నది ఉనికిని నిర్ధారించాయి. పార్లమెంట్‌కు ఇస్రో సమర్పించిన పత్రాలలో సరస్వతీ నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేది, శాటిలైట్‌ ఫోటోల ద్వారా ఇస్రో నిర్ధారించింది. 3 వేల సంవత్సరాల క్రితం వాతావరణంలో వచ్చిన  మార్పులు, భౌగోళికంగా జరిగిన మార్పులతో సరస్వతీ, దాని ఉపనది అయిన దృషద్వతి కనిపించకుండా పోయాయని కూడా స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని మానా, బదరీనాథ్ సమీపంలోన అలకానంద నదితో కలిసి సరస్వతి నది ప్రవహించినట్టుగా కూడా గుర్తించారు.

కనిపించని నది…

వైవిద్యమైన చర్చలు సరస్వతి నది కేంద్రీకృతంగా సాగుతున్నాయి. కనిపించని నదికి పుష్కరాలు నిర్వహించడం ఏంటీ..? ఆ నది నీరు ఉండదు కదా..? పుణ్య స్నానాలు ఏ నీటితో చేస్తారు అన్న వాదన వినిపించే వారు వినిపిస్తూనే ఉన్నారు. అయితే పూర్వకాలం నుండి కూడా భారతదేశంలో 12 నదులకు పుష్కరాలు జరిపే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిలో సరస్వతి నది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ నది భౌగోళికంగా వచ్చిన మార్పుల వల్ల అంతర్థానం అయినప్పటికీ శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కర వేడుకు నిర్వహిస్తున్న సాంప్రాదాయం అయితే ఉంది. కాకపోతే ఇంత కాలం సరస్వతి నదికి పుష్కరం జరిపే తంతు సమీప ప్రాంతాల్లో ఫార్మాలిటీగా నిర్వహించేవారు. కానీ ఈ సారి తెలంగాణ ప్రభుత్వం మాత్రం సరస్వతి నదికి అధికారికంగా పుష్కరాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొత్త పద్దతికి శ్రీకారం చుట్టినట్టయింది. 12 నదులకు ఆయా ప్రాంతాల్లో అధికారికంగా పుష్కరాలు జరుపుతున్నప్పుడు కాలగర్భంలో కలిసిపోయిన సరస్వతి నదికి కూడా ఈ వేడుక జరపడం సరైన నిర్ణయమేనని అంటున్నారు వేద పండితులు. 3 వేల సంవత్సరాల క్రితమే అంతర్థానం అయిన ఈ నదికి పుష్కరాలు జరిపే ఆనవాయితీని పూర్వీకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు తప్ప దాని స్థానంలో మరో నదిని చేర్చలేదు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితిని కొనసాగించే ప్రక్రియలో బాగంగానే ఈ సారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపడుతోంది.

You cannot copy content of this page