దిశ దశ, జాతీయం:
మంగళవారం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో మరణించగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న మావోయిస్టు పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఏపీలోని ఆయా ప్రాంతాలను మావోయిస్టు పార్టీ సేఫ్ జోన్ గా భావించినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే విజయవాడ పెనుమలూరు ఆటో నగర్ లో మంగళవారం ఉదయం ఓ ఇంట్లో కృష్ణ జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన 28 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు విజయవాడ ఆటోనగర్ కు వచ్చి వెల్తుంటారని ఈ ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసుకున్నట్టయితే బావుంటుందన్న యోచనతోనే మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే తాము అదుపులోకి తీసుకున్న వారిలో తొమ్మిది మంది మావోయిస్టు పార్టీ చీఫ్ తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ప్రొటెక్షన్ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారని కృష్ణ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల షెల్టర్లను గుర్తించి సోదాలు నిర్వహిస్తున్నామని ఏపీ పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే విజయవాడలో దొరికిన మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రొటెక్షన్ టీమ్ సభ్యులతో పాటు 19 మంది కేంద్ర కమిటీ సభ్యుడు, మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో చనిపోయిన హిడ్మా బెటాలియన్ కు చెందిన వారు 19 మంది ఉన్నారని ఎస్పీ ప్రకటించారు. అయితే పార్టీ చీఫ్ దేవ్ జీ ప్రొటెక్షన్ టీమ్ మెంబర్స్ కూడా దొరకడంతో ఆయన ఏమయ్యాడన్నదే మిస్టరీగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న వారిలో కూడా దేవ్ జీ రక్షణ చర్యల్లో నిమగ్నమైన కేడర్ ఉండి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ నేఫథ్యంలో దేవ్ జీ లేకుండానే ప్రొటెక్షన్ టీమ్ ఏపీకి చేరిందా..? ఆయన సేఫ్ జోన్ లో ఉండి వీరిని పంపించారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఇంకా సోదాలు పూర్తయిన తరువాత దేవ్ జీ గురించి తెలిసే అవకాశం ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రొటెక్షన్ టీమ్ లేకుండానే..?
మూడు నుండి ఐదంచెల భద్రత నడుమ కార్యకలాపాలు కొనసాగించే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి రక్షణ కోసం ఏర్పాటు చేసిన బృందం ఆయనను వీడి విజయవాడకు ఎలా చేరుకుందన్న చర్చ మొదలయింది. దండకారణ్య అటవీ ప్రాంతంలోనే ఆయన సేఫ్ జోన్ లో ఉండి తనను కాపాడేందుకు ఉన్న రక్షణ బృందాన్ని ఏపీకి పంపించేందుకు క్లియరెన్స్ ఇచ్చారా లేక… ఆయన కూడా వీరితో పాటు ఏపీకి చేరుకున్నాడా అన్న అంశంపై ఉత్కంఠత నెలకొంది. పోలీసులు జరిపిన సోదాల్లో దేవ్ జీ దొరికాడా లేక ఆయన మరో చోట ఉన్నాడా..? పోలీసుల దాడుల నేపథ్యంలో ఆయన కూడా అదే షెల్టర్ జోన్ నుండి తప్పించుకున్నాడా అన్న అంశంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి. కీకారణ్యాల్లో ఉన్నప్పుడే అప్పటి కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజును బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నంబళ్ల గత మే నెలలో చనిపోయిన తరువాత ఆ స్థానాన్ని తిపిరి తిరుపతితో భర్తీ చేశారని వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తరువాత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కేంద్రంలో వనాలు వీడి జనంలోకి వచ్చి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజ్జుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోనుదాదా ద్వారా పోలీసులు తెలుసుకున్న సమాచారం ప్రకారం దేవ్ జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టలేదని తెలిసింది. ఆ తరువాత తెలంగాణ డీజీపీ ముందు మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న జనజీవనంలో కలిసినప్పుడు దేవ్ జీని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. దీంతో ఆయన సీసీ కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నట్టుగా స్పష్టం అయింది. కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో ఉన్న నేతను వీడి ప్రొటెక్షన్ ఫోర్స్ వేరే చోటకు చేరుకోవడానికి కారణం ఏంటన్న విషయం అంతుచిక్కకుండా పోతోంది. ఆయనను కంటికి రెప్పలా చూసుకోవల్సిన బాధ్యతల్లో ఉన్న రక్షణ బృందం బాహ్య ప్రంపంచంలోకి అడుగుపెట్టిందంటే దేవ్ జీ సేఫ్ గా ఉన్నాడా లేదా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
కోరుట్లలో టెన్షన్…
మరోవైపున తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ స్వగ్రామమైన కోరుట్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తరువాత విజయవాడలో దేవ్ జీ ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ప్రకటించారు. దీంతో ఆయన లొంగిపోయారా లేక అరెస్ట్ అయ్యారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఆయన రక్షణ కోసం వలయంగా ఉండాల్సిన వారిలో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన గురించి స్థానికంగా ఆందోళన నెలకొంది.

