ఆ బియ్యం ఎక్కడి నుండి వచ్చాయ్..?

ఆరా తీస్తున్న పోలీసులు..?

దిశ దశ, హుజురాబాద్:

బియ్యం లారీని పౌరసరఫరా అధికారులకు అప్పగించిన తరువాత పోలీసులు పట్టించుకోరని భావిస్తున్న స్మగ్లర్లకు ఆందోళన కల్గించే విషయమే ఇది. ఆ లారీ గురించి పూర్తి స్థాయిలో ఆరా తీయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో అసలు గుట్టు వెలుగులోకి రావడమే కాకుండా రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందా తీరు గురించి కోర్టుకు కూడా విన్నవించే అవకాశం ఉంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు…

బోర్నపల్లి మిల్లు…

మూడు రోజుల క్రితం హుజురాబాద్ పట్టణంలో బోర్నపల్లి రైస్ మిల్లులో పట్టుబడ్డ లారీపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అక్రమంగా తరలిపోతున్న ఆ బియ్యం పీడీఎస్ రైస్ అని తేల్చిన తరువాత సివిల్ సప్లై అధికారులకు అప్పగించిన పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు బ్రేకులు వేయాలంటే లోతుగా విచారణ చేయాలని భావిస్తున్నారు. బోర్నపల్లి లవకుశ రైస్ మిల్లు నుండి అక్రమంగా బియ్యం తరలిపోతున్నాయని సమాచారం అందుకున్న వెంటనే హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు. అయితే లారీ పట్టుకున్న తరువాత అందులోని బియ్యం సంచులను పరిశీలించిన పోలీసు అధికారులు అసలు విషయాన్ని గమనించారు. తెలంగాణ సివిల్ సప్లై విభాగం సరఫరా చేసే గన్నీ బ్యాగుల్లోనే బియ్యం అక్రమంగా సరఫరా అవుతున్న విషయం గుర్తించిన పోలీసు అధికారులు అసలేం జరుగుతోంది అన్న కోణంలో ఆరా తీయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఎక్కడి నుండో..?

లవకుశ రైస్ మిల్లు నుండి అక్రమంగా తరలిపోతున్న బియ్యం ఏ రేషన్ షాపుకు చేరుకోవల్సినవి..? అవి గోదాం నుండి నేరుగా మిల్లుకు వచ్చాయా..? లేక డీలర్ వద్ద నుండి ఇక్కడకు చేరుకున్నాయా అన్న విషయంగా తెలుసుకునే పనిలో పడినట్టుగా సమాచారం. గన్నీ బ్యాగ్స్ ఆధారంగా సివిల్ సప్లై గోదాముల నుండి పూర్తి వివరాలు సేకరించేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. సివిల్ సప్లై గోదాముల నుండి రేషన్ డీలర్లకు సరఫరా చేసేప్పుడు బయో మెట్రిక్ విధానం అమలు చేస్తున్నందున సంబంధిత గోదాముల నుండి వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి. రేషన్ షాపుల వరకు బియ్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారా..? చేస్తున్నట్టయితే లవకుశ రైస్ మిల్లు నుండి తరలిపోతున్న బియ్యం ఏ గోదాము నుండి ఇక్కడకు చేరుకున్నాయి అన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా గన్నీ బ్యాగ్స్ పై ముద్రించిన వివరాల్లో వేర్వేరు మిల్లుల పేర్లు ఉన్నాయని, ఆయా మిల్లులు ఎక్కడ ఉన్నాయి..? ఆ మిల్లుల నుండి ఏ సివిల్ సప్లై గోదాములకు బియ్యం తరలించేందుకు అనుమతులు ఉన్నాయి అన్న వివరాలు కూడా సేకరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 2022-23 సంవత్సరం పంటకు సంబంధించినట్టుగా గన్నీ బ్యాగ్స్ పై ముద్రించి ఉండడాన్ని బట్టి చూస్తే దీని వెనక ఏమైనా వ్యూహాం ఉందా అని కూడా ఆరా తీయనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపులకు ఏ సంవత్సరం పంట బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు..? లవకుశ రైస్ మిల్లులో పట్టుబడడ్డ లారీల్లోని బియ్యం సంచులపై 2022-23 సంవత్సరం పంట అని ముద్రించి ఉన్నాయంటే స్మగ్లర్లు అధికారులు తప్పదారి పట్టించే కుట్ర చేశారా..? ఈ వ్యవహారం వెనక ఉన్నవారెవరూ..? ఈ స్థాయిలో స్మగ్లింగ్ చేసేంత సాహసం చేయడానికి కారణమేంటీ..? మాఫియా హస్తం తదితర సమగ్ర వివరాలను సేకరించేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.