కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్…
దిశ దశ, కాళేశ్వరం:
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆర్థిక భారం పడిందని, సెంట్రల్ వాటర్ కమిషన్ ను మిస్ గైడ్ చేశారని, వాప్కోస్ నివేదికకు ముందే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం వైఫల్యాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో పలు వైఫల్యాలను ఎత్తి చూపిన ఘోష్ కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తప్పు పట్టింది.
బ్యారేజీలపై…
బ్యారేజీలను నిర్మించాలన్న నిర్ణయం కేసీఆర్ దేనని, క్యాబినెట్ అనుమతులు లేకుండానే నిర్మించారని రిపోర్టులో ఘోష్ కమిషన్ పేర్కొంది. ఆయన తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వ అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని, టర్న్ కీ పద్దతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సూచించినా పట్టించుకోలేదని తేల్చింది. వాప్కోస్ సంస్థను సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చారని వివరించింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టడం వల్ల ఆర్థికపరమైన భారం పడుతుందని 2015లో నిపుణల కమిటీ నివేదిక ఇచ్చిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లి వద్ద నిర్మాణం చేపడితే బావుంటుందని సూచించిందని కమిషన్ గుర్తించింది. అయితే ఈ నివేదికను అప్పటి ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిందని అభిప్రాయపడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను మార్చే విషయంలో వాప్కోస్ ను సంప్రదించలేదని, ఇందుకోసం హైపవర్ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి నిర్ణయం తీసుకుందని పేర్కొంది. రెండు చోట్ల బ్యాక్ వాటర్ నిలువ ఉంచడానికి అవసరమైన పరిశోధనలు చేపట్టలేదని, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జి-డి కర్వ్స్ మరియు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్” వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదని స్పష్టం చేసింది. సెకెంట్ పైల్స్ నిర్మాణం కోసం తనిఖీలు చేయకుండానే అవును అని మాత్రమే నివేదికల్లో వివరించబడిందని కమిషన్ గుర్తించింది.
చిత్తశుద్ది…
తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చే విషయంలో చిత్త శుద్ది లోపించిందని, నీటి లభ్యత లేదన్న కారణం చూపించి సైట్ ను మార్చాలన్న యోచనతో తప్పుదారి పట్టించేందుకు సమర్థించుకున్నట్టుగా అనిపిస్తోందని కమిషన్ పేర్కొంది. మూడు బ్యారేజీలను నిర్మించాలని ప్రాథమిక అనుమతుల కసం విడుదల చేసిన G.O.Rt. No. 231, 232, మరియు 233 1.3.2016ల విడుదల విషయంలో నియమావళిని పాటించలేదంది. ఈ అంశాన్ని క్యాబినెట్ ముందు అసలు ఉంచనేలేదని, క్యాబినెట్ ఆమోదం కూడ తెలపలేదని ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది.
వాప్కోస్ డీపీఆర్…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వాప్కోస్ (
WAPCOS) డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) ఇవ్వకముందే అప్పటి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ రాశారని పేర్కొంది. 11.2.2016న రాసిన ఈ లేఖలో ప్రాజెక్టు వ్యయం 71,436 కోట్లు అవుందని పేర్కొన్నారని వివరించింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని, బ్యారేజీల్లో నీటి నిలువ విషయంలో కూడా ఇదే జరిగిందని వివరించింది.
మెయింటెనెన్స్…
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా లేకపోవడం, మూడు బ్యారేజీల విషయంలో కాలనుగుణంగా తనిఖీలు చేపట్టకపోవడం కూడా తప్పిదమని, వర్షాకాలానికి ముందు, తరువాత తనిఖీలు చేపట్టలేదని పేర్కొంది. పంప్ హౌజ్ ల ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు బ్యారేజీలలో వాటి సామర్థ్యానికి అనుగుణంగా నిరంతరంగా నీటిని నిలువ ఉంచాలని నిర్ణయించడం సరికాదని అభిప్రాయపడింది. నిర్విరామంగా నీటిని నిలువ ఉంచడం కూడా బ్యారేజీల డ్యామేజీకి కారణమై ఉంటుందని కూడా పేర్కొంది.
సర్టిఫికెట్లు…
మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన నిర్మాణ ధృవీకరణ పత్రం 9.2.2019 ఇచ్చారని, పనులు పూర్తయినట్టుగా 15.03.2021న ఇచ్చారని ఇది చట్ట విరుద్దమని, ఏజెన్సీకి అనుకూలంగా వ్యవహరించే దురుద్దేశ్యం దీని వెనక దాగి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. పనులు పూర్తి కాకముందు, లోపాలు ఉన్నాయని తెలిసి కూడా బాధ్యత రాహితయంగా జవాబుదారీ తనం లేకుండా పోయిందని కమిషన్ పేర్కొంది. మూడు బ్యారేజీల అవకతవకలకు కారణం అప్పటి ముఖ్యమంత్రితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావులు నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా పరిగణనలోకి తీసుకోలేదని తేల్చింది. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొత్తగా ఏర్పడిాన రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడడంలో నిబద్దతను పాటించలేదని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాల గురించి తనకు తెలియదని కూడా వాదించారని కమిషన్ నివేదికలో వివరించింది.
అధికారుల తీరు…
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారులు తప్పిదాలను కూడా కమిషన్ ఎత్తి చూపింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషీ నిపుణల కమిటీ నివేదికను అణిచివేయడం, పరిపాలనా అనుమతులతో నియమాళను ఉల్లంఘించడం, ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ క్యాబినెట్ ఆమోదాలకు సంబంధించి నియమాలను పాటించడంలో విఫలం అయ్యారని, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన సి మురళీ ధర్ నిపుణుల కమిటీని అణిచివేయడంతో పాటు CWCకి తప్పుడు సమాచారం అందించారని, దురుద్దేశ్యపూర్వకంగా సవరించిన అంచనాలను ప్రతిపాదించారని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో విఫలం అయినందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. చీఫ్ ఇంజనీర్ గా పని చేసిన బి హరిరామ్ కూడా నిపుణుల కమిటీని అణిచివేయడంతో పాటు సిడబ్లూసీకి తప్పుడు సమాచారం అందించారని, KIPCLకు ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన బ్యారేజీల గురించి తనకు తెలియదని వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది. రామగుండం సీఈ ఎన్ వెకంటేశ్వర్లు, కె సుధాకర్ రెడ్డి, ఈఈ సర్దార్ ఓంకార్ సింగ్, ఇంజనీరింగ్ అధికారులు బి నాగేందర్ రావు, ప్రమీల, ఏ నరేందర్ రెడ్డి, కెఎస్ఎస్ చంద్రశేఖర్, బస్వరాజ్, టి శ్రీనివాస్ తో పాటు పలువురు కమిషన్ ముందు తప్పుడు సాక్ష్యం ఇచ్చారని పేర్కొంది. మొత్తం 16 మంది అధికారుల వైఫల్యాలను కమిషన్ ఎత్తి చూపింది.

