దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీలో నెలకొన్న పరిణామాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. పార్టీ నాయకుల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకుండా పోవడం, జనజీవనంలోకి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుండడంతో పార్టీలో అసలేం జరుగుతోందన్నదే అంతు చిక్కకుండా పోతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి చెందిన రెండు కమిటీలు వేర్వేరుగా విడుల చేసిన ప్రకటనలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
అనంత్ ప్రకటన…
మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గడ్ (MMC) జోనల్ కమిటీ అనంత్ పేరిట గత నాలుగు రోజులుగా ఓ ఆడియో వైరల్ అయింది. తాజాగా ఆయన పేరిట లేఖ కూడా విడుదల అయింది. తాము వచ్చే జనవరి 1న జన జీవనంలో కలుస్తున్నామని అప్పటి వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ ప్రభుత్వాలు సంయమనం పాటించాలని అనంత్ కోరారు. ఆయుధాలతో సహా లొంగిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇందు కోసం బావోఫెంగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా పార్టీ శ్రేణులు తనతో మాట్లాడవచ్చని కూడా సూచించారు. అయితే ఇప్పటి వరకు నార్త్, సౌత్ బస్తర్, మాడ్.. గరియాబంద్, మహారాష్ట్రలోని గడ్చిరోలి తదితర ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు సాయుధులుగా ఆయా రాష్ట్రాల్లో లొంగిపోయారు. తెలంగాణలో జనజీవనంలో కలిసిన కీలక నేతలు నిరాయుధులుగానే జన జీవనంలో చేరగా తాజాగా మాత్రం కొంతమంది ఆయుధాలను అప్పగించారు. ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే తాజాగా MMC జోనల్ కార్యదర్శి అనంత్ తాము జన జీవనంలోకి వస్తామని ఆయుధాలతోనే ప్రజల మధ్యకు వస్తామని బాహాటంగా ప్రకటించారు. ఇందుకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సహకరించాలని, డిసెంబర్ 2 నుండి జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాలు కూడా నిర్వహించబోమని వెల్లడించారు.
పోలీసుల అదుపులో…
మర్ వైపున మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) అధికార ప్రతినిధి వికల్ప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హిడ్మా ఎన్ కౌంటర్ బూటకమని ఆరోపించిన ఆయన నవంబర్ 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. అయితే మావోయిస్టు పార్టీ చీఫ్ తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తో పాటు మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని వారిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని వికల్ప్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్య నేత పోలీసుల అదుపులో ఉన్నాడని పార్టీకి ప్రధాన డెన్ ఏరియా అయిన దండకారణ్య కమిటీ నేతనే ప్రకటించడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల విజయవాడలో పోలీసులు సాయుధ నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రొటెక్షన్ టీమ్ సభ్యులు కూడా అందులో ఉన్నారని ప్రకటించారు. అప్పుడే దేవ్ జీ ఆచూకి ఏమై ఉంటుందన్న చర్చ జరిగినప్పటికీ పోలీసుల నుండి కానీ పార్టీ నుండి కానీ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన సేఫ్ గానే ఉన్నారని భావించారంతా. కానీ తాజాగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విడుదల చేసిన లేఖలో ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడని పేర్కొనడం గమనార్హం.

