దిశ దశ, పెద్దపల్లి:
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సందర్శించారు. సోమవారం మానేరు నదిలో ధ్వంసానికి గురైన చెక్ డ్యాం ప్రాంతాలను పరిశీలించారు. పేలుడు కారణంగానే చెక్ డ్యాం ధ్వంసమైందని వాటర్ మ్యాన్ అభిప్రాయపడ్డారు. మానేరు నదికి అత్యంత కీలకమైన ఇసుకను డిసిల్ట్రేషన్ పేరిట తీయడం సరికాదని, చెక్ డ్యాంల వల్ల నదితో పాటు పరిసర ప్రాంత రైతాంగానికి కూడా ఉపయోగకరమని వాటర్ మ్యాన్ అన్నారు. చెక్ డ్యాంల విధ్వంసానికి పాల్పడిన ద్రోహులను శిక్షించాల్సిందేనని, అలాగే చెక్ డ్యాంలను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. మానేరు నదిలో జరుగుతున్న విధ్వంసం గురించి వెలుగులోకి తీసుకొచ్చేందుకు దేశంలోని ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నామని మానేరు పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు నోముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏన్జీటీ తీర్పును గౌరవించి ప్రభుత్వం మానేరులో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానేరు నదిలో నిర్మాణం చేసిన చెక్ డ్యాంల గురించి తెలంగాణ జలరంగ నిపుణులు వి ప్రకాష్ వివరించారు. చెక్ డ్యాంల ఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మానేరు నదిని నిపుణులు సందర్శించేందుకు చొరవ తీసుకుంటున్నామని, దీనివల్ల అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. చెక్ డ్యాం ఘటనల నిజ నిర్దారణ కమిటీ సభ్యులు బీవీ రావు, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కరుణాకర్ రెడ్డి, ఎన్జీటీ పిటిషన్ దారులు సంధి సురేందర్ రెడ్డి, చిటికేశి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

