ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం…
డిక్లరేషన్ ఇచ్చే పద్దతి పాటించలేదా..?
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని మూల సూత్రాలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? అమలు చేసినా కూడా తప్పు దారి పట్టించారా అన్నది తేలాల్సిన అవసరం ఉంది. నేర ప్రవృత్తి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల మాత్రమే సాంకేతికతను అంది పుచ్చుకోవాలన్న విధానం తెలంగాణ పోలీసు విభాగంలో అమలవుతోంది. క్రిమినల్ కేసులు ఉన్న వారి గురించి ఆరా తీసేందుకు, కాల్ డిటైల్డ్ రికార్డ్ (CDR) తీసుకోవాలంటే డిక్లరేషన్ ప్రొఫార్మా నింపిన తరువాతే దర్యాప్తు అధికారులకు అనుమతి ఇస్తారు. కేసు పరిశోధనలో భాగంగా నిందితులు, అనుమానితులకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులో లేక కేసు దర్యాప్తు చేస్తున్న సిబ్బంది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే పద్దతి అమలు చేస్తుంటారు. కేసుల వివరాలతో పాటు నిందితులు, అనుమానితులకు సంబంధించిన CDR తెలుసుకునేందుకు సంబంధిత పోలీసులు కాంటాక్టు నంబర్లను సేకరించి వాటికి సంబంధించి డిక్లరేషన్ చేస్తుంటారు. తాము సేకరిస్తున్న మొబైల్ ఫోన్ నంబర్లు నేర ప్రవృత్తితో సంబంధం ఉన్న వారివేనని, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధించినవి కాదని స్పష్టంగా పేర్కొన్న తరువాతే సమాచార సేకరణ కోసం అనుమతి ఇస్తారు. రాష్ట్రంలోని ఆయా పోలీస్ స్టేషన్లతో పాటు దర్యాప్తు విభాగాలన్నింటా కూడా ఈ పద్దతిని విధిగా పాటిస్తుంటారు. తమకున్న అధికారాన్ని ఆసరగా చేసుకుని సంబంధం లేని వ్యక్తుల డాటా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో సీబీఐ జాయింట్ డైరక్లర్ గా పని చేసిన జేడీ లక్ష్మీ నారాయణ కాల్ డాటా సేకరించిన అంశం వెలుగులోకి వచ్చినప్పుడు ఇందుకు సహకరించిన అధికారులు, ఫిర్యాదు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న సంగతి విధితమే. అధికారుల నంబర్ల వివరాలు సేకరించేంత సాహసం చేసిన తీరు అప్పట్లో సంచలనం అయింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో మొబైల్ ఫోన్ డాటా సేకరించేందుకు పోలీసు విభాగం డిక్లరేషన్ ఇచ్చే ఆనవాయితీని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. కేవలం నేరాలతో సంబంధం ఉన్న వారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు మాత్రమే సేకరించేందుకు ఈ పద్దతిని అవలంభించినట్టుగా సమాచారం. లేనట్టయితే తమకు అందివచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినట్టయితే చట్టపరమైన ఇబ్బందులు పోలీసులు కూడా ఎదుర్కోవల్సి వస్తుందని ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్యుల హక్కులకు భంగం కలగకుండా ఉంటుందని ఈ పద్దతిని పాటిస్తున్నారని సమాచారం.
SIBలో మరీ..?
అసాంఘీక శక్తులను నియంత్రించేందుకు సాధారణ ఇంటలీజెన్స్ విభాగానికి అనుబంధంగా స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూరో (SIB)ని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ విభాగం ద్వారా సంఘ విద్రోహ శక్తులను పట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్న వారి ఆచూకి కోసం ప్రత్యేకగా ఏర్పాటు చేసిన SIB విభాగం ద్వారా ఫోన్ ట్యాపింగ్ విధానం అమలు చేసినప్పుడు సాధారణ పోలీసు యంత్రాంగానికి ఉన్నట్టుగానే డిక్లరేషన్ విధానం అమలు చేశారా లేదా అన్న చర్చ మొదలైంది. తాము డాటా సేకరిస్తున్న వారంతా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారేనని పేర్కొంటు సంబంధిత అధికారి డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే రివ్యూ కమిటీ ఆమోదించిందా లేక ఈ విధానాన్ని SIB విభాగానికి మినహాయింపు ఇచ్చారా అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు చేసే ఇతర పోలీసు విభాగాలకు ఉన్నట్టుగానే SIBకి కూడా అదే నిబంధన వర్తించినట్టయితే డిక్లరేషన్ ఇచ్చిన అధికారి ఎవరోనన్నది గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ SIBకి ఈ నిబంధన విషయంలో సడలింపు ఇచ్చినట్టయితే ఇందుకు కారణం ఏంటీ..? వారికి స్వేచ్ఛ కల్పించడానికి మూలమేంటీ అన్న కోణంలో కూడా ఆరా తీస్తే అసలు నిజం బయటపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్యాపింగ్ కోసం ఫోన్ నంబర్ల జాబితాను సిద్దం చేసిన అధికారి తమ పై అధికారికి డిక్లరేషన్ ఇచ్చారా లేక… చీఫ్ ఆఫీసరే ఆ జాబితాను తయారు చేసినట్టయితే రివ్యూ కమిటీకో లేక ఇతర ఉన్నతాధికారులకో ప్రొఫార్మ పంపించారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత తీసుకోవల్సిన అవసరం ఉంది. ఒక వేళ SIBకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అప్పటి అధికారులు డిక్లరేషన్ అవసరం లేదని నిర్ణయించినట్టయితే… దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, SIB అధికారులు తప్పటడుగులు వేయకుండా కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న విషయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నంబర్ ట్రాప్ చేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల ఫలితాలను కట్టడి చేయాలన్న ఆలోచన చేయకుండానే SIBకి స్వేచ్ఛ ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. డిక్లరేషన్ అంశంపై కూడా సిట్ దృష్టి సారించినట్టయితే మరిన్ని వాస్తవాలు బయటపడతాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

