అంతర పంటగా గంజాయి… ఆసిఫాబాద్ జిల్లాలో పట్టివేత…

నక్సల్స్ ఏరివేత తరహాలోనే కూంబింగ్…

సాంకేతికతను అందిపుచ్చుకుంటాం: ఏఎస్పీ చిత్తరంజన్…

దిశ దశ, ఆసిఫాబాద్:

సరిహధ్దు జిల్లాల్లో గంజాయి ఏరివేతే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం బలగగాలచే కూంబింగ్ నిర్వహించినట్టుగానే గంజాయి సాగును గుర్తించేందుకు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని గంజాయిని పట్టుకునేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు కార్యరంగంలోకి దిగారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ లో గత జనవరి నుండి ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేయగా దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే గంజాయి మొక్కులను గుర్తించారు. ఆదివారం జిల్లాలోని కెరమెరి మండలం అంతాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని నారాయణగూడ గ్రామంలో డ్రోన్ల సాయంతో అంతరపంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించామని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. పోలీసు బలగాలచే పంట చేలల్లో గంజాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పుడు పత్తి పంట దెబ్బ తింటుందని గమనించి డ్రోన్ల సాయంతో అంతరపంటగా వేస్తున్న గంజాయిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యామన్నారు. డ్రోన్ల ద్వారా సేకరించిన ఫుటేజిని ఎనాలిసిస్ చేసి గంజాయి మొక్కలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యామని త్వరలో సాంకేతికతను అందిపుచ్చుకుని కేవలం గంజాయి మొక్కలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఏఎస్పీ చిత్తరంజన్ వెల్లడించారు. పత్తి పంటలో అంతరపంటగా వేస్తూ ఆదాయం గడించవచ్చని రైతులు భావిస్తున్నారు కానీ కేసు నమోదు చేస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లలో అరెస్ట్ చేస్తామని, కఠినమైన చట్టాల వల్ల రైతులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలకు…

ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ మరో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు. గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ భూముల రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ భూముల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సాయాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరుతున్నామన్ని దీనివల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఏఎస్పీ స్పష్టం చేశారు. రైతులు గంజాయి సాగు చేసి డబ్బు గడించాలన్న ఆలోచనలకు స్వస్తి పలకాలని, గ్రామాల్లో గంజాయి సాగు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చిత్తరంజన్ తెలిపారు.