దిశ దశ. పెద్దపల్లి:
దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తారాదికి వెల్లే ప్రధాన రైల్వే రూట్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం నుండి ఎక్కడికక్కడ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేరకోకుండా మార్గమధ్యలోనే ఆగిపోవల్సి వచ్చింది. కాజీపేట, బల్లార్షా మార్గ మధ్యలో ఏర్పడిన అంతరాయంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్యాసింజర్లు ప్రయాణించే రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లను కూడా ఎక్కడికక్కడ ఆపివేశారు. పెద్దపల్లి జిల్లా కూనారం వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్టుగా తెలుస్తోంది. కూనారం వద్ద రైల్వే ట్రాక్ మీదుగా నిర్మించాల్సిన వారథి కోసం గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో బ్రిడ్జికి సపోర్ట్ గా వేసిన ఓ ఐరన్ పోల్ విరగడంతో రైళ్ల రాకపోకలను అర్థాంతరంగా నిలిపివేసినట్టుగా తెలిస్తోంది. ఆర్ఓబీ వద్ద విరిగిపోయిన ఐరన్ రాడ్లను సవరించిన తరువాతే రైళ్లను పునరుద్దరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే అధికారులు హుటాహుటిన కూనారం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


