దిశ దశ, గంగాధర:
గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన వృద్ద దంపతులపై విష ప్రయోగం ఘటనలో భార్య లక్ష్మీ కూడా మరణించింది. చికిత్స పొందుతున్న లక్ష్మీ బుధవారం మద్యాహ్నం చనిపోయవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. అక్టోబర్ 7న అనారోగ్యం బారిన పడిన శంకరయ్య, లక్ష్మీలకు అదే గ్రామానికి చెందిన కత్తి శివ తెల్ల కళ్లులో కలిపే మత్తు గుళికలు ఇవ్వడంతో ఆరోగ్యం కుదుటపడుందని నమ్మి వాటిని వేసుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని గమనించి ఆసుపత్రికి తరలించగా భర్త శంకరయ్య అక్టోబర్ 8న మరణించగా. భార్య లక్ష్మీ బుధవారం శాశ్వత నిద్రలోకి చేరుకుంది.
వంట పనిలో..
అక్టోబర్ 7న కత్తి శివ ఇచ్చిన మత్తు గుళికలు వేసుకున్న దంపతులు ఇద్దరు కూడా విచిత్రమైన పరిస్థితిలో ఇంటివద్ద వంట పనుల్లో నిమగ్నం అయిన క్రమంలో అపస్మారక స్థితిలో పడిపోయారు. ఇంటి ఆవరణలో మటన్ బోటీని శుభ్రం చేస్తున్న శంకరయ్య అలాగే ముందుకు వంగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఇంట్లో అన్నం వండుతున్న లక్ష్మీ కూడా అదే పరిస్థితికి చేరుకుంది. కత్తి శివ తమకు ఇచ్చినవి సాధారణ మాత్రలేనని నమ్మి వాటిని వేసుకుని భోజనం ఏర్పాట్లలో నిమగ్నం అయిన క్రమంలోనే అచేతనులు కావడం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ సమచారం అందుకున్న పోలీసులు కూడా వృద్దులు ఇద్దరూ ఒకే రీతిలో అచేతనులు అయి ఉండడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా కత్తి శివ తెల్ల కళ్లులో కలిపే మత్తు గుళికలు ఓవర్ డోస్ ఇచ్చి చంపాడని గుర్తించారు.
వ్యసనపరుడై…
ఆన్ లైన్ బెట్టింగ్ జూదంతో పాటు ఇతరాత్ర వ్యసానలకు బానిసైన కత్తి శివ తన అవసరాలు తీర్చుకునేందుకు తనపై విశ్వాసం ఉంచిన వృద్ద దంపతులను చంపాలని పథకం వేసుకున్నాడు. లక్ష్మీ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు కోసం వారిని హత్య చేసేందుకు స్కెచ్ వేసి కటకటాల పాలయ్యాడు. రెండు రోజుల క్రితమే శివను పోలీసులు అరెస్ట్ చేయగా బుధవారం లక్ష్మీ మరణించడంతో అతనిపై జంట హత్యల కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
రూ. లక్షా 85 వేల కోసం…
వృద్ద దంపతులకు మత్తు గుళికలు ఇచ్చిన శివ రెండు గంటల తరువాత వారి ఇంటికి వెళ్లి బంగారు పుస్తెల తాడును అపహరించుకుని పరార్ అయ్యాడు. దానిని విక్రయిస్తే రూ. 1.85 లక్షలు రాగా అప్పులు కట్టుకుని మిగతా సొమ్మును తన వ్యసనాల కోసం వెచ్చించి నాశనం చేశాడు. రూ. లక్షా 85 వేల కోసం కత్తి శివ వృద్ద దంపతులను హత్య చేసిన తీరు స్థానికంగా సంచలనం కల్గించింది. వ్యసనపరుడైన కత్తి శివ వృద్ద దంపతులను హత్య చేసిన తీరు తెలిసిన స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశ్వాసం చూపించి వృద్ద దంపతులకు సపరిచర్యలు చేయాల్సింది పోయి బంగారం పుస్తెల తాడు కోసం వారిని కాటికి పంపించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల నిందితున్ని చాకచక్యంగా పట్టుకోగలిగారు. లేనట్టయితే శంకరయ్య, లక్ష్మీల మరణాలు మిస్టరీగానే మిగిలిపోయేవి.

